ఏపీలో రౌడీల రాజ్యం

ఏపీలో రౌడీల రాజ్యం - Sakshi


శాంతిభద్రతలపై అసెంబ్లీలో సర్కారును నిలదీసిన విపక్షం

 

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న శాంతిభద్రతల సమస్యపై మంగళవారం కూడా శాసన సభ దద్దరిల్లింది. రాష్ట్రంలో రౌడీలు, పోలీసుల రాజ్యం నడుస్తోందని, దీనిపై చర్చకు స్పీకర్ అనుమతించాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. స్పీకర్ చర్చకు అనుమతినివ్వకపోవడంతో విపక్ష సభ్యులు.. నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం ను చుట్టుముట్టారు. ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం స్వల్ప విరామం తర్వాత 11.35 గంటలకు సభ తిరిగి ప్రారంభమైంది. వెంటనే శాంతిభద్రతల సమస్యపై చర్చకు అనుమతించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని, 344 నిబంధన కింద ఈ చర్చను చేపట్టాలని పట్టుబట్టారు. అయితే శాంతిభద్రతలపై బుధవారం చర్చకు అవకాశమిస్తానని స్పీకర్ చెప్పారు. దీనిపై సంతృప్తి చెందని వైఎస్సార్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు.దీంతో స్పీకర్ సభ ప్రారంభమైన 15 నిమిషాలకే వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం 1.15 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే వైఎస్సార్ సీపీ సభ్యులు శాంతి భద్రతలపై చర్చకు మళ్లీ పట్టుబట్టారు. దీనిపై ఈరోజే చర్చ జరగాలని గట్టిగా కోరారు. ఈ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. ‘పరిటాల రవీంద్రను హత్య చేసింది మీరే. మీ చేతులు రక్తంతో తడిశాయి’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై విపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో రాజకీయ హత్యలు జరుగుతుంటే అధికార పార్టీ సభ్యులు ఎదురుదాడికి దిగుతున్నారని వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు. మంగళవారం ఈ అంశంపై చర్చకు అవకాశం లేదని, అందరూ సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని స్పీకర్ కోరారు.దీంతో వైసీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. ‘సభ జరగకుండా చూడటం మా ఉద్దేశం కాదు. ప్రధాన సమస్య అయిన శాంతిభద్రతలపై చర్చకు అనుమతి ఇవ్వండి’ అని స్పీకర్‌ను కోరారు. ఓ వైపు వైసీపీ సభ్యులు చర్చకు పట్టుబడుతున్న సమయంలోనే మంత్రి యనమల రామకృష్ణుడును మాట్లాడాల్సిందిగా స్పీకర్ అనుమతించారు. యనమల మాట్లాడుతూ.. ‘రూల్ ప్రకారమే ఎవరైనా నడుచుకోవాలి. ఒకవేళ బుధవారం 344 కింద చర్చ జరిగినా ముందుగా మా సభ్యులకు అవకాశమిచ్చిన తర్వాతే ప్రతిపక్షాలకు అవకాశమివ్వాలి. దీనిపై చర్చకు మేము సిద్ధమే. గతంలో జరిగిన హత్యలన్నింటిపైనా మాట్లాడతాం’ అని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం సహకారంతో జరుగుతున్న రాజకీయ హత్యలపై సభలో చర్చ జరగాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఇరకాటంలో పడ్డ టీడీపీ సభ్యులు పరిటాల రవి హత్యోదంతాన్ని తెరమీదకు తెచ్చి నినాదాలు చేశారు. ఇరుపక్షాల సభ్యుల నినాదాలతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top