సీనియర్లకు పెద్దపీట

ysrcp Appointment of Parliament District Presidents - Sakshi

పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుల నియామకం

 ఏలూరుకు ఎమ్మెల్సీ ఆళ్ల నాని

 నరసాపురానికి మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు

 రాజమండ్రికి సీనియర్‌ నేత మోషేన్‌రాజు

 ఏలూరు నగర అధ్యక్షుడిగా బొద్దాని

సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియామకాల్లో సీనియారిటీకి పెద్ద పీట వేశారు. లోక్‌సభ నియోజకవర్గం కేంద్రంగా అధ్యక్షుల నియామకం జరిగింది. నంద్యాల ఎన్నికల సందర్భంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వచ్చే ఎన్నికలకు పార్టీని సన్నధ్దం చేసేందుకు వీలుగా లోక్‌సభ పరిధిలో జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టారు. ఇందులో సీనియారిటీకి పెద్దపీట వేశారు. సామాజిక సమీకరణలను కూడా పాటించారు. కాపు, క్షత్రియ, దళిత వర్గాలకు ఈ పదవులు దక్కాయి. ఏలూరు నగర అధ్యక్ష పదవి బీసీ వర్గానికి దక్కింది. 

రాజమండ్రి నియోజకవర్గానికి కూడా పశ్చిమగోదావరి జిల్లా వ్యక్తినే నియమించారు. ఏలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని)ను నియమించారు. ఆయన ఇప్పటికే జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. నర్సాపురం పార్లమెంట్‌కు మాజీ శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజును నియమించారు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. జగన్‌మోహనరెడ్డి పార్టీ పెట్టిన వెంటనే కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఆయన అసెంబ్లీకి రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 

ఇక రాజమండ్రి పార్లమెంట్‌ విషయానికి వస్తే ఆ పార్లమెంట్‌ పరిధిలో నాలుగు నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉండగా, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఉన్నాయి. దీంతో ఈ నియోజకవర్గానికి పార్టీ నేత శ్రీకాకుళం ఇంఛార్జిగా ఉన్న కొయ్యె మోషేన్‌రాజును నియమించారు. ఇక ఏలూరు నగర అధ్యక్షునిగా బొద్దాని శ్రీనివాస్‌ను నియమించారు. బొద్దాని శ్రీనివాస్‌ ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాజమండ్రి పార్లమెంట్‌ అధ్యక్షునిగా నియమించినందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డికి, జాతీయ ప్రధానకార్యదర్శి విజయసాయిరెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కొయ్యె మోషేన్‌రాజు ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top