ఎప్పుడొస్తావు.. నాన్నా..!

Ysr  District Resident Missing In Kuwait - Sakshi

భార్యా బిడ్డలను పోషించుకునేందుకు పొట్టచేత బట్టుకుని పరాయి దేశానికి వెళ్లిన ఆ ఇంటి యజమాని ఎక్కడున్నాడో.. ఏమయ్యాడో.. తెలియని పరిస్థితిలో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. పిల్లలైతే నాన్నా ఎప్పుడొస్తావు.. అంటూ ఎదురు చూస్తున్నారు.. గల్ఫ్‌ దేశంలో సేఠ్‌ల చేతిలో చిత్ర హింసలకు గురై ఆచూకీ లేకుండా పోయిన తమ తండ్రిని తమ వద్దకు చేర్చాలంటూ ఆ చిన్నారులు విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంట తడిపెట్టిస్తోంది. 

సాక్షి,లక్కిరెడ్డిపల్లె(వైఎస్సార్‌కడప) : లక్కిరెడ్డిపల్లె మండలం మద్దిరేవుల గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన సయ్యద్‌ అలీ 2013 సంవత్సరం జనవరి నెల 31వ తేదీన చెన్నై నుంచి కువైట్‌కు జి8300359 నెంబరు గల పాస్‌పోర్టు ద్వారా వెళ్లాడు. అప్పటి నుంచి సయ్యద్‌ అలీని కువైట్‌ సేఠ్‌లు(కఫిల్‌) మారుస్తూ, అతడిని కొడుతూ ఉండేవారు. ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఇతను నలురుగు కఫిల్ల వద్ద పని చేశాడు. కువైట్‌లో ఇతడిని గొర్ల కాపరిగా, తోట హమాలీగా పనికి కుదుర్చుకున్నారు.

కఫిల్‌ అతడిని ప్రతి రోజూ కొడుతూ ఉండేవాడని, ఈ విషయమై గొడవ కూడా జరగడంతో అతను  2016  సంవత్సరం జూన్‌ 10వ తేదీన ఇంటికి నెట్‌ ద్వారా ఫోన్‌ చేసి సిటీకి దూరంగా ఉన్న అడవిలో మరో కఫిల్‌ వద్ద పని దొరికిందని, అక్కడికే వెళ్తున్నానని, అక్కడ బాగుంటే ఉంటానని, లేకుంటే నాలుగు రోజుల్లో ఇండియాకు తిరిగి వస్తానని చెప్పాడు. ఇక అంతే అప్పటి నుంచి సయ్యద్‌ అలీ నుంచి ఎలాంటి ఫోన్‌ రాలేదు.  దీంతో అతను ఏమయ్యాడోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

2016వ సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీన కువైట్‌లో ఉంటున్న జి.కె.రాచపల్లెకు చెందిన అబ్దుల్‌ రహిమాన్‌ అనే వ్యక్తి ఇక్కడికి ఫోన్‌ చేసి సయ్యద్‌ అలీ ఇండియాకు వచ్చాడా అని అడిగాడు. సయ్యద్‌ అలీ మరణించి రెండు నెలలు అయిందని , అతని బంధువులు ఎవ్వరూ కువైట్‌లో లేరా అని అక్కడి కఫిల్‌ తనను అడిగాడని రహిమాన్‌ పేర్కొన్నాడు.ఈమేరకు ఇండియన్‌ ఎంబసీలో ఫిర్యాదు చేసినా ఇంకా సయ్యద్‌ అలీ ఆచూకి తెలియలేదని, సమాధానం వస్తోందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సయ్యద్‌ అలికి భార్య రహమతున్నిసా, కుమారుడు అమీర్, కుమార్తె ఆసిఫా ఉన్నారు. మూడేళ్లుగా ఆచూకీ లేకుండా పోయిన తమ అన్న ఏమయ్యాడో తేల్చాలని, సయ్యద్‌ అలీ తమ్ముడు సయ్యద్‌ షరీఫ్‌ బుధవారం కువైట్‌ ఎన్‌ఆర్‌ఐలకు వినతిపత్రం అందజేశాడు. భర్త కోసం భార్య, తండ్రి కోసం పిల్లలు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న నేపథ్యంలో అధికారులు స్పందించి అతని ఆచూకీపై స్పష్టత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top