ప్రజలను ఆందోళనకు గురిచేయద్దు : సీఎం జగన్‌

YS Jagan Review Meeting On Corona Virus Precautionary Measures - Sakshi

సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో కరోనా వైరస్‌(కోవిడ్‌-19) నిరోధంకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కీలక సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, సీఎం కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్‌లతోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వ్యాపించకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలను ఈ సందర్భంగా అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. దీనిపై సీఎం జగన్‌ స్పందిస్తూ.. ప్రజలను ఆందోళనకు గురిచేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు జాగ్రత్తలు సూచించడంతోపాటు.. కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

అనుమానిత కేసులుంటే వారికి వెంటనే వైద్య సదుపాయం అందేలా చూడాలని చెప్పారు. గ్రామ సచివాలయాలను కరోనా వైరస్‌ నిరోధంలో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. కరోనా వైరస్‌ సోకితే ఏం చేయాలి, ఏం చేయకూడదనే దానిపై గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారం పంపాలని సూచించారు. అనంతపురం, విజయవాడల్లో ప్రత్యేక వార్డుల నిర్వహణకు రూ. 60 కోట్లు , ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రూ. 200 కోట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు.(చదవండి : పేదవాడి సొం‍తింటి కలకు.. బృహత్‌ ప్రణాళిక)

విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. వారిని సంప్రదించి ఆరోగ్య వివరాలు సేకరించడంతోపాటు.. జాగ్రత్తలు సూచిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలియజేశారు. 24 అనుమానిత కేసుల్లో 20 నెగెటివ్‌ వచ్చాయని.. మరో నాలుగింటికి సంబంధించి రిపోర్ట్స్‌ రావాల్సి ఉందని వివరించారు. 

వైద్య సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తున్నాం :అధికారులు
‘కరోనా నిరోధక  చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని వైద్య సిబ్బందికి తగిన శిక్షణ ఇప్పిస్తున్నాం. ముందస్తుగా 351 బెడ్లు, 47 వెంటిలేటర్లు, 1.10 లక్షల మాస్కులు, 12,444 పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్లు సిద్ధం చేశాం. మరో 12వేల పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ కొత్తగా కొనుగోలు చేయడంతోపాటు, మరో 50వేల మాస్కులు కూడా అందుబాటులో ఉంచుతాం. ఐసోలేషన్‌ వార్డులను ప్రధాన ఆస్పత్రికి దూరంగా ఏర్పాటు చేస్తున్నాం. అన్ని రకాల సదుపాయాలతో వాటిని ఏర్పాటు చేస్తున్నాం. అనంతపురం, విజయవాడల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను కరోనా వైరస్‌ కేసు బాధితులకు చికిత్స అందించడానికి సిద్ధంచేస్తున్నాం.

కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్నాయని ఎవరైనా కాల్‌చేస్తే ప్రభుత్వ అంబులెన్స్‌లో నేరుగా ఆస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేస్తాం. రోగిని తరలించిన వెంటనే ఆ అంబులెన్స్‌ను పూర్తిగా స్టెరిలైజ్‌ చేస్తాం. దీనికి సంబంధించిన ప్రోటోకాల్స్‌ రూపొందించుకున్నాం. ఎక్కడైనా పాజిటివ్‌ కేసు వస్తే ఆ ఇంట్లో ఉన్నవారికి, చుట్టుపక్కల వారిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచుతాం. విదేశాలనుంచి వచ్చిన వారు ఎవరైనా 14 రోజులు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని చెప్తున్నామ’ని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు తెలిపారు. (చదవండి : ఉపేక్షించొద్దు: సీఎం జగన్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top