
టార్చిలైట్లు, లాంతర్ల వెలుగులో వైఎస్ జగన్ పరామర్శ
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్షం, చీకటిని లెక్కచేయకుండా తుపాను ప్రభావ బాధితులను పరామర్శించారు.
విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్షం, చీకటిని లెక్కచేయకుండా తుపాను ప్రభావ బాధితులను పరామర్శించారు. శనివారం రాత్రి వైఎస్ జగన్ టార్చ్లైట్లు, లాంతర్ల వెలుగులో పాడేరులోని ఎరడవల్లి గిరిజనులను పరామర్శించారు. తుపాన్ కారణంగా సర్వం కోల్పోయామని, కొంతమందికి బియ్యం తప్ప మరే సహాయం అందలేదని గిరిజనులు తమ గోడు వెల్లబోసుకున్నారు. అందరికీ సరైనా పరిహారం అందేలా పోరాడుతానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
వైఎస్ జగన్ అంతకుముందు అనకాపల్లి, చోడవరం, మాడుగుల మండలాలల్లో తుపాను కారణంగా నష్టపోయిన బాధిత రైతులను పరామర్శించారు. కాఫీ తోటల రైతులకు రూ.లక్ష చొప్పన చెల్లించాలని డిమాండ్ చేశారు. గిరిజనులు మిరియాలు, కాఫీ తోటలతో ఎకరాకు లక్ష చొప్పున సంపాదిస్తున్నారని.. వారికి హెక్టారుకు రూ. 10 వేలు, రూ.15 వేలు ఇవ్వడం సరికాదన్నారు. ఈ విషయాన్నిప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఎకరాలకు రూ.లక్ష చొప్పున పరిహారంగా ఇవ్వాలన్నారు. ఒకవేళ రూ.లక్ష చొప్పన పరిహారం ఇవ్వకపోతే అన్యాయం చేసినట్లు అవుతుందని జగన్ స్పష్టం చేశారు. కాఫీ పంటకు ఆధారమైన సిల్వర్ ఓక్ చెట్లు భారీ ఎత్తున కూలిపోయాయని.. మళ్లీ చెట్లు పెరగాలంటే 15 సంవత్సరాలు పడుతుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.
వర్షంలోనూ తన పర్యటన కొనసాగించిన జగన్ మోదపల్లి వద్ద దెబ్బతిన్న కాఫీ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజనులు వైఎస్ జగన్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పంటలు పూర్తిగా నష్టపోయాయని, ఒక్కో చెట్టూ పెరగాలంటే 20 సంవత్సరాల కాలం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో ఎకరాకు రూ. 1,50 లక్షల వరకూ ఆదాయం వస్తుందని జగన్ కు తెలిపారు. దీంతో ఆవేదన వ్యక్తం చేసిన జగన్.. మిరియాలు, కాఫీ పంటల రైతులకు ఎకరాకు కనీసం రూ.లక్ష ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ చెట్లు లేకపోతే కాఫీ దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయని తెలిపారు.ఏ ఒక్క గిరిజనుడికి రెండు ఎకరాలు మించి లేదని జగన్ పేర్కొన్నారు.