అర్హులకే సంక్షేమ పథకాలు అందాలి

The YCP Will Win In The Next Election - Sakshi

ముఖ్యమంత్రి ఇచ్చిన  మాటలను నిలబెట్టుకోలేక పోతున్నారు

ఎప్పుడు ఎన్నికలొచ్చినా  వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయం

ఎమ్మెల్యే రాజన్నదొర

సాలూరురూరల్‌ : అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రాజన్నదొర కోరారు. పాచిపెంట మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో పార్టీకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాలకు సంబంధించి  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజమైన,  స్పష్టమైన ప్రకటనలు చేయాలన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా రుణగ్రహీతల ఎంపికలు జరిగితే అధికారులు ఇబ్బంది పడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పాచిపెంట మండలంలో అన్ని కార్పొరేషన్లకు సంబంధించి 942 దరఖాస్తులు రాగా 168 యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. దీని వల్ల మండలంలో గొడవలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలు ఉన్నప్పటికీ 2016 వరకు మండలంలో రుణాల మంజూరుకు సంబంధించి ప్రధాన పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేసేవారన్నారు.

ఈ ఏడాది మాత్రం అధికార పార్టీ నాయకులు ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఆర్‌పీ భంజ్‌దేవ్‌ ప్రతి సమావేశంలో సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని, కాని నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ పాలనపై విరక్తి చెందిన ప్రజలు రాజన్నరాజ్యం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.

సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని ఈ సందర్భంగా ఎంపీడీఓ కామేశ్వరరావుకు సూచించగా, రెండు  రోజుల్లో రుణాలకు సంబంధించిన సమస్యలను  పరిష్కరిస్తానని ఎంపీడీఓ తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ తట్టికాయల గౌరీశ్వరరావు , ఎంపీపీ ప్రతినిధి ఇజ్జాడ తిరుపతిరావు, వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు గొట్టాపు ముత్యాలునాయుడు, బీసీ, ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకులు సలాది అప్పలనాయుడు, గండిపల్లి రాము, జిల్లా ప్రధాన కార్యదర్శి డోల బాబ్జి, నాయకులు పెద్దిబాబు, అప్పలనాయుడు, తదితరులు  పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top