కోర్టు ఆవరణలో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన కృష్ణాజిల్లా కైకలూరులో సోమవారం కలకలం సృష్టించింది.
కైకలూరు(కృష్ణా జిల్లా): కోర్టు ఆవరణలో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన కృష్ణాజిల్లా కైకలూరులో సోమవారం కలకలం సృష్టించింది. జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఉండగానే మొదటి గేటు సమీపంలో మహిళ ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భర్తకు సంబంధించిన ఆస్తిని అత్త విక్రయించడానికి ప్రయత్నించడంతో ఆమె ఈ చర్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వణుదుర్రు గ్రామానికి చెందిన నాగలక్ష్మికి కలిదిండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మారగాని నాగేశ్వరరావుతో 1999లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం.
భర్త మద్యానికి బానిసై తనను వేధిస్తున్నాడంటూ 2011లో భర్త, అత్త వెంకటలక్ష్మిపై కైకలూరు కోర్టులో బాధిత మహిళ కేసు వేసింది. అనంతరం ఆమె కూలి పనులు చేసుకుంటూ తల్లి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో భర్తకు చెందిన ఆస్తిని అత్త విక్రయించేందుకు ప్రయత్నిస్తుండడంతో పాటు భర్త తరఫు న్యాయవాది రాజీకి రావాలంటూ ఆమెను వేధిస్తున్నారు. తన పిల్లలకు అన్యాయం జరుగుతుందన్న భయంతోనే నాగలక్ష్మి ఆత్మహత్యకు యత్నించింది.