ప్రతి ఓటు ఆయుధమే | Weapons of every vote | Sakshi
Sakshi News home page

ప్రతి ఓటు ఆయుధమే

Jan 26 2014 1:58 AM | Updated on Sep 2 2017 3:00 AM

ప్రతి ఓటు ఆయుధమే

ప్రతి ఓటు ఆయుధమే

దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిం చాల్సిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో అత్యంత శక్తివంతమైన ఆయుధమైన ఓటును వినియోగించుకునేందుకు...

మచిలీపట్నం, న్యూస్‌లైన్ : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిం చాల్సిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో అత్యంత శక్తివంతమైన ఆయుధమైన ఓటును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని  కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం స్థానిక ఆశీ ర్వాద్ భవన్‌లో నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ  జిల్లాలో 18-25 సంవత్సరాల మధ్య ఉన్న యువతీయువకులు మూడు లక్షల మంది ఓటర్లుగా నమోదు కావాల్సి ఉందన్నారు.

45 రోజులుగా జిల్లా యంత్రాంగం ఓటర్ల చేర్పులపై కసరత్తు చేసి 2.50 లక్షల మందిని నమోదు చేశారని చెప్పారు. మరో 50వేల మంది యువత ఓటరుగా నమోదు చేయించుకోవాల్సి ఉందని తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. ఓట రుగా నమోదు చేసుకునేందుకు ఫిబ్రవరి వరకు సమయం ఉందని, ఎవరైనా ఓటరుగా నమోదు కావాలంటే సమీపంలోని బీఎల్‌వోలు, తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఆన్‌లైన్‌లో ఓటరుగా నమోదు చేసుకునే వారు వారి పేరు, తల్లిదండ్రుల పేరు, చిరునామా ఆన్‌లైన్‌లో పొందుపరిస్తే బీఎల్‌వోలు లేదా ఇతర అధికారులు చిరునామానాను బట్టి విచారణ చేసి ఓటరుగా గుర్తిస్తారని చెప్పారు. మరో వంద రోజుల్లో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయని, రానున్న ఐదేళ్లకు మంచి పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు ఓటు సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. ఓటు హక్కు వినియోగించుకునే బాధ్యత తదితర అంశాలపై రానున్న 50 రోజుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం ప్రచారం చేయడానికి సన్నద్ధమవుతుందని చెప్పారు.

కృష్ణా యూనివర్సిటీ వీసీ వున్నం వెంకయ్య మాట్లాడుతూ   ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న భారత ఎన్నికల సంఘాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాల్సి ఉందన్నారు. 2011లో భారత ఎన్నికల సంఘం చేపట్టిన సంస్కరణల కారణంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ధృక్పదం పెరిగిందని తెలిపారు.  ఎస్పీ జె.ప్రభాకరరావు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో పోలీసులతో పాటు ప్రజలందరిపైనా బాధ్యత ఉందన్నారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎవరైనా అవకతవకలకు పాల్పడుతున్నట్లు  దృష్టికి వస్తే... వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు.  

జేసీ జె.మురళీ మాట్లాడుతూ ఓటర్లలో అధికశాతం మంది యువతే ఉన్నారని చెప్పారు. డీఆర్వో ఎల్.విజయచందర్, ట్రైనీ కలెక్టర్ కాళీచరణ్ తదితరులు ప్రసంగించారు. భారత ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ వీఎస్ సంపత్ ప్రసంగాన్ని ఎల్‌సీడీ ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాలల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.  

స్వాతంత్ర సమరయోధులు కొండపల్లి పాండురంగారావు, సీనియర్ ఓటర్లు చిలకలపూడి రామ్మోహనరావు, కన్నెగంటి సూర్యప్రకాశరావును కలెక్టర్ సన్మానించారు. బందరు ఆర్డీవో పి.సాయిబాబు, డీపీవో సదారావు, పద్మశ్రీ గొరిపర్తి నరసింహరాజు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటామని సమావేశానికి హాజరైన వారితో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement