
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనానికి ప్రభుత్వం ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా నాసిరకం పనుల డొల్లతనం బయట పడుతూనే ఉంది. పెథాయ్ తుపాను వల్ల రెండు రోజులుగా రాజధాని ప్రాంతంలో ఓ మోస్తరు వర్షం పడుతోంది. అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఛాంబర్‌లోకి సోమవారం పైకప్పు నుంచి వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో ఛాంబర్‌లోని ఫైళ్లన్నింటినీ మరో గదిలోకి మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది మే నెలలోనూ, అంతకుముందు కూడా పలుమార్లు కురిసిన చిన్నపాటి వర్షానికే అసెంబ్లీ తాత్కాలిక భవనంలోని ప్రతిపక్ష నేత ఛాంబర్‌లోకి నీరు చేరిన విషయం తెలిసిందే. మొదటిసారిగా ఈ ఛాంబర్‌లోకి వర్షం నీరు వచ్చినప్పుడు వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు కావాలనే పైపులు కోసేశారని ప్రభుత్వ పెద్దలు అప్పట్లో ఆరోపించిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా ఆ సంఘటనను విద్రోహ చర్యగా అభివర్ణిస్తూ విచారణ కోసం ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఆ తర్వాత సీఐడీ నివేదిక ఏమైందో కూడా తెలియడం లేదు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఛాంబర్‌లోకి పలుమార్లు వర్షం నీరు చేరిన నేపథ్యంలో సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ పాటు ఇతర అధికారులు అసెంబ్లీ తాత్కాలిక భవనాన్ని తనిఖీ చేశారు. ఆ సమయంలో మీడియాను అనుమతించకుండా ఆంక్షలు విధించడం అప్పట్లో విమర్శలకు దారితీసింది. వారి వెంట మీడియా ప్రతినిధులు జగన్ ఛాంబర్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అధికారులు గేటు వద్దే అడ్డుకున్నారు. పెథాయ్ తుపాను ప్రభావంతో కురిసిన చిన్నపాటి వర్షానికే జగన్‌మోహన్‌రెడ్డి ఛాంబర్‌లోకి నీరు రావడం అసెంబ్లీ తాత్కాలిక భవనాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం జగన్ ఛాంబర్‌లోకి వర్షం నీరు వచ్చిందన్న విషయం తెలిసి అక్కడికి వెళ్లేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా అసెంబ్లీ సిబ్బంది మరోమారు అడ్డుకున్నారు.