వీఆర్‌వో, వీఆర్‌ఏ ఫలితాల్లో టాప్ వీరే | vro, vra exam results released | Sakshi
Sakshi News home page

వీఆర్‌వో, వీఆర్‌ఏ ఫలితాల్లో టాప్ వీరే

Feb 23 2014 1:02 AM | Updated on Sep 2 2017 3:59 AM

గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌వో), గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.

రేపటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
27వ తేదీకల్లా ప్రాథమిక నియామక ప్రక్రియ పూర్తి
4 వేల మంది డిప్యూటీ తహశీల్దార్లకు గెజిటెడ్ హోదా

 
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌వో), గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో ఫలితాల సీడీలను విడుదల చేశారు. వీఆర్‌వో పరీక్షలో ఎం.నరేంద్రరెడ్డి(చిత్తూరు జిల్లా), ఎం.శ్యామ్‌సుందర్‌రెడ్డి (నల్లగొండ) వందకు వంద మార్కులు సాధించారు. బి.యోగానందరెడ్డి(అనంతపురం) 99 మార్కులు పొందాడు.  ఇక వీఆర్‌ఏ పరీక్షలో బోనాల ప్రభాకర్ (అనంతపురం జిల్లా), పల్లా వీరవెంకటకృష్ణారావు (తూర్పుగోదావరి), డి.రామకృష్ణ (నిజామాబాద్) వరుసగా తొలి మూడు స్థానాలు సాధించారు. ccla.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలు చూడవచ్చు. జిల్లాల వారీగా ర్యాంకుల వివరాల సాఫ్ట్ కాపీలను కలెక్టర్లకు పంపించారు. వీఆర్‌వోలకు జూనియర్ అసిస్టెంట్ హోదా కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి అనంతపురం జిల్లా మడకశిరలో విలేకరులకు తెలిపారు. అప్పుడు నెలకు రూ.17 వేల జీతం వస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల మంది డిప్యూటీ తహశీల్దార్లకు గెజిటెడ్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. రెవెన్యూ మంత్రిగా ఈ ఉత్తర్వులపై చివరి సంతకం పెట్టినట్లు వివరించారు.
 
 జిల్లా ఎంపిక కమిటీల ఆధ్వర్యంలో..
 కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ) వీఆర్‌వోల భర్తీ చేపడుతుంది. ఆర్డీవో/సబ్ కలెక్టర్ నేతృత్వంలోని డివిజినల్ స్థాయి ఎంపిక కమిటీ వీఆర్‌ఏ భర్తీ నిర్వహిస్తుంది. ఖాళీలు, రిజర్వేషన్‌ల వారీగా మెరిట్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ప్రాథమికంగా ఎంపికైన వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతోపాటు ఈనెల 24వ తేదీ నుంచి జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని ఎస్సెమ్మెస్‌లు పంపుతారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఈనెల 27వ తేదీకల్లా ప్రాథమిక నియామక ప్రక్రియ పూర్తి చేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లను రెవెన్యూ ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించారని మహంతి ఈ సందర్భంగా అధికారులను అభినందించారు. రికార్డు సమయంలో (కేవలం రెండు నెలల్లో) ఇన్నివేల పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తున్నామని సీసీఎల్‌ఏ కృష్ణారావు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement