దెబ్బ మీద దెబ్బ | Untimely rain inflicted on the damage to Paddy | Sakshi
Sakshi News home page

దెబ్బ మీద దెబ్బ

Apr 25 2015 3:32 AM | Updated on Sep 3 2017 12:49 AM

నిన్నటి వరకు నీటి ఎద్దడి. తెగుళ్లు. అడ్డంకుల్ని అధిగమించి పంట పండిస్తే కోతల సమయంలో...

- పది రోజుల్లో రెండో అల్పపీడనం
- వరికి చేటు కలిగించిన అకాలవర్షం
- పనల మీదున్న పంటకు భారీ నష్టం
- దిగాలు పడుతున్న రైతాంగం
రాజమండ్రి :
నిన్నటి వరకు నీటి ఎద్దడి. తెగుళ్లు. అడ్డంకుల్ని అధిగమించి పంట పండిస్తే కోతల సమయంలో అకాల వర్షాలు అన్నదాత వెన్నువిరుస్తున్నాయి. రబీ కోతలు మొదలైన గత పది రోజుల్లో రెండు అల్పపీడనాల వల్ల కురిసిన వర్షాలు రైతులను నష్టాల పాల్జేశాయి. పనల మీద ఉన్న చేలు వర్షం బారిన పడడంతో వారు కుదేలవుతున్నారు. డెల్టా, మెట్ట ప్రాంతాల్లో వరి కోతలు జోరుగా సాగుతున్న సమయం కురిసిన వర్షాలు అన్నదాతకు తీరని వ్యధను మిగిల్చాయి.

పశ్చిమ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు ఏర్పడిన అల్పపీడనద్రోణి వల్ల జిల్లాలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏకధాటిగా వర్షం పడింది. కాకినాడ, తుని, జగ్గంపేట, పిఠాపురం, ఏలేశ్వరం, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో రెండు గంటల పాటు వర్షం కురిసి, మరో గంటపాటు చినుకులు పడుతూనే ఉన్నాయి. ఉదయం ఎండ త్రీవత ఎక్కువగా ఉన్నా వాతావరణం ఒక్కసారిగా మారి, సామాన్యులు సేద తీరినా రైతులు మాత్రం నష్టాల పాలయ్యారు.

గత పది రోజుల్లో ఇది రెండవ అల్పపీడనం కావడంతో రబీ వరిపంట నష్టం రానురాను పెరుగుతోంది. గత వారం అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన వర్షం వల్ల సుమారు 50 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. తాజాగా వర్షంవల్ల నష్టం మరింత పెరిగే అవకాశముంది. ఆలమూరు, రామచంద్రపురం, కాకినాడ, పిఠాపురం సబ్ డివిజన్ల పరిధిలో నష్టం అధికంగా ఉండే అవకాశముంది. ఇక్కడ 40 శాతానికి పైగా కోతలు పూర్తయ్యాయి. చేలు చాల వరకు పనల మీద ఉన్నాయి. వర్షాల వల్ల చేలు అక్కడక్కడా పడిపోయాయి. దీని వల్ల పెద్ద నష్టం లేకున్నా, పనల మీద ఉన్నచోట నష్టం తీవ్రత ఎక్కువగా ఉండనుంది.

ఎకరానికి 10 నుంచి 15 బస్తాల వరకు తగ్గనున్న దిగుబడి జిల్లాలో సుమారు 30 వేల ఎకరాలకు పైగా చేలు పనల మీద ఉన్నట్టు అంచనా. కాగా, వర్షాల వల్ల ఇక్కడ 30 శాతానికి పైగా రైతులు దిగుబడి కోల్పోనున్నారు. తాళ్లరేవు, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లోని శివారు గ్రామాల్లో పనలు నీట నానుతున్నాయి. దీనితో రైతులు ఆదరాబాదరాగా నీటిని బయటకు తోడుతున్నారు. ఇటువంటి చోట ఎకరాకు 10 నుంచి 15 బస్తాల వరకు దిగుబడి తగ్గుతుందని వాపోతున్నారు.

వర్షాల వల్ల చాలాచోట్ల కోతలు, నూర్పిడులు నిలిచిపోయాయి. డెల్టాలో చేలల్లో నీరు నిలిచి  మిషన్లతో కోత కష్టతరమైంది. ఇదే అదనుగా వారు కూలీ ధరలు పెచడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పడం వారిని మరింత హడలెత్తిస్తోంది. శ నివారం కూడా ఇలాగే వర్షం పడితే పనల మీద ఉన్న పంటపై ఆశలు వదులు కోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తేమశాతం ఎక్కువగా ఉందని దళారులు ధర తగ్గించి వేస్తుండగావర్షాలు తమను మరింత కుంగదీశాయని బెంగటిల్లుతున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement