అర్ధరాత్రి నిప్పు.. భద్రతకు ముప్పు

Unknown Persons Challange to Rajampeta Police YSR kadapa - Sakshi

రాజంపేట పోలీసులకు సవాల్‌గా మారిన దహనం సంఘటనలు

నిప్పుపెట్టిన వారు ఆకతాయిలా? సైకోలా

భయాందోళనలో స్థానికులు

వైఎస్‌ఆర్‌ జిల్లా  , రాజంపేట:  రాజంపేటలో చోటుచేసుకుంటున్న దహనం సంఘటనలు పోలీసులకు సవాల్‌గా మారాయి. ఎనిమిదేళ్ల క్రితం పట్టణంలోని సాయినగర్‌లో వరుసగా ఇంటిబయట ఉన్న బైకులకు కొందరు దుండగులు నిప్పుపెట్టారు. అప్పటి నుంచి ఈ ఇలాంటి సంఘటనలు అడపా దడపా జరుగుతూనే వస్తున్నాయి. తాజాగా పట్టణ నడిబొడ్డున ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద  300 యేళ్ల కిందటి వినియోగంలో లేని రథానికి నిప్పు పెట్టడంతోపాటు పలుచోట్ల వాహనాలకు నిప్పు పెట్టడం తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనలు పట్టణ వాసుల్లో భయాందోళనను రేకెత్తిస్తున్నాయి.

వాహనాలకు భద్రత కరువు..
బైకులు, భారీ వాహనాలకు భద్రత కరువైంది. తమ ఇంటి ముందు, వీధిలోను,   ఆవరణంలో ఉంచిన వాహనాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెడతారనే భయం వాహనదారులను వెంటాడుతోంది. ఇప్పుడు వాహనాలు బయట పెట్టుకోవాలంటే జంకుతున్నారు. పట్టణంలో ఇలాంటి సంఘటనలు జరగడం కొత్తేమీ కాకపోయినప్పటికీ అది ఇప్పుడు మళ్లీ జరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎందుకిలాచేస్తున్నారో..
వాహనాలకు నిప్పుపెట్టడం వల్ల వారికి కలిగే ఆనందం ఏమిటో..ఎందుకిలా చేస్తున్నారో అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రత్యర్ధులను టార్గెట్‌ చేసుకొని తమ కసి తీర్చుకోవడం సహజమే. అలాంటిదేమీ లేకున్నా.. వాహనాలకు నిప్పుపెట్టిన వారితో ఎలాంటి సంబంధంలేకున్నా ఎందుకు నిప్పుపెడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.

తలలు పట్టుకుంటున్న పోలీసులు
పట్టణంలో వాహనాలకు నిప్పుపెడుతున్న వారి తీరు అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వాహనాలకు నిప్పు పెడుతూ సైకోలా  వ్యవహరిస్తున్న వారు స్థానికులా, ఇతర ప్రాంతానికి చెందిన వారా అనేది తెలియని పరిస్థితి.  

సీసీ కెమెరాలు పనిచేస్తుంటే...
పట్టణంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు ఇప్పుడు పనిచేయడంలేదు. అవి పనిచేయకపోవడంతో జరుగుతున్న సంఘటనల కారకులను గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు పోలీసులు ప్రైవేటు వారి సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా సోమవారం సాయంత్రం పట్టణంలోని ఓ లాడ్జిలో తనిఖీలు చేసి సీసీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకురావాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

లోతుగా దర్యాప్తు చేస్తున్నాం
రాజంపేటలో చోటుచేసుకున్న దహనం సంఘటనలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. రథంతోపాటు వాహనాలకు నిప్పుపెట్టిన సంఘటనకు సంబంధించి వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నాము. అవసరమైన ఆధారల సేకరణలో ఉన్నాము.– రాఘవేంద్ర, డీఎస్పీ, రాజంపేట

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top