ఏమయ్యారో..!

Two Children Missing in Basheer Baba Festival - Sakshi

ఉరుసు ఉత్సవాల్లో ఇద్దరు బాలురు అదృశ్యం

పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు

తూర్పుగోదావరి, కొత్తపల్లి: ముస్లింల ఆరాధ్య దైవంగా కొలిచే బషీర్‌ బీబీ(బంగారుపాప) ఉరుసు 64వ ఉత్సవాల్లో ఇద్దరు బాలురు అద్యశ్యమైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ ఉత్సవాల్లో ఇటువంటి సంఘటన ఎన్నడూ జరగలేదని స్థానిక ముజావర్లు అంటున్నారు. ఉత్సవాలు ముగిసిన తరువాత ఆలయానికి వచ్చిన భక్తులు ఇంటికి బయలు దేరేసమయంలో వారిరువురు అదృశ్యమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపల్లి మండలం పొన్నాడలో వేంచేసిన బషీర్‌బీబీ ఉరుసు ఉత్సవాలు ఈనెల 15, 16, 17 తేదీల్లో జరిగాయి. గుంటూరు జిల్లా పట్నారిపాలెం మండలం చందోలు గ్రామానికి చెందిన షేక్‌ అజీజ్‌ తన కుటుంబ సభ్యులతో పాటు కుమారుడు షేక్‌ మహబూబ్‌ సుభానీ(4), ఇదే జిల్లా పొన్నూరు రోడ్డుకు చెందిన కరీముల్లా కుటుంబసభ్యులతో పాటు తన కుమారుడు సయ్యద్‌ అబ్దులా(5)తో కలిసి ఉరుసు ఉత్సవాలకు 16న పొన్నాడ చేరుకున్నాడు.

రెండు రోజుల పాటు ఉత్సవాలు పాల్గొన్నారు. సోమవారం ఉదయం తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అప్పటివరకు ఆలయ సమీపంలో ఆడుకున్న షేక్‌ మహబూబ్‌ సుభానీ, సయ్యద్‌ అబ్దుల్లాలు కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు గాలించారు. వారి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం పోలీసులు విచారణ ప్రారంభించారు. కాకినాడ డీఎస్పీ రవివర్మ, పిఠాపురం ఇన్‌చార్జి సీఐ ఈశ్వరుడు, ఎస్సై కృష్ణమాచార్యులు పొన్నాడ చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఇద్దరు బాలురు కిడ్నాప్‌కు గురయ్యారా? లేక తప్పిపోయారా? అనే కోణాల్లో దర్యప్తు చేస్తున్నారు. ఆలయ సమీపంలో ప్రత్యేక బలగాలతో గాలింపు చేపట్టారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సీపీ ఫుటేజీని సేకరించారు. పిఠాపురం, కా>కినాడ రైల్వే, బస్‌ స్టేషన్లలో ఆచూకీ కోసం సిబ్బందిని ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ తెలిసిన వారు కొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై సెల్‌ : 9440900752కి సమాచారం తెలియజేయాల్సిందిగా కోరారు.

చిన్నారులవివరాలిలా..
షేక్‌ మహబూబ్‌ సుభానీ వయస్సు నాలుగేళ్లు. ఎత్తు మూడడుగులు, చామనఛాయ రంగు, జీన్‌ ఫ్యాంటు, పచ్చరంగు కలిగిన గళ్ల చొక్కా దుస్తులు ధరించాడు. సయ్యద్‌ అబ్దుల్లా వయస్సు ఐదు సంవత్సరాలు. ఎత్తు 3.5అడుగులు రంగు చామనఛాయ, తెలుపురంగు నిక్కరు, నలుపు రంగు చొక్కా దుస్తులు ధరించారు. తప్పిపోయిన ఇద్దరు పిల్లలు కూడా అన్నయ్య, చెల్లెలు కుమారులు. అబ్దుల్లా స్వగ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి వెళుతున్నాడు. వారు అదృశ్యం కావడంతో ఆలయం వద్ద కుటుంబ సభ్యులు విషాదానికి గురయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top