టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6న కరీంనగర్‌లో నిర్వహించతలపెట్టిన బహిరంగసభ వాయిదాపడింది.
కరీంనగర్, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6న కరీంనగర్‌లో నిర్వహించతలపెట్టిన బహిరంగసభ వాయిదాపడింది. సెప్టెంబర్ 7న టీజేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ ఎత్తున శాంతిర్యాలీని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ బహిరంగసభను వాయిదా వేయాలని పార్టీ జిల్లా నాయకులకు సూచించినట్లు సమాచారం. జేఏసీ శాంతిర్యాలీ, టీఆర్‌ఎస్ బహిరంగసభకు ఒకేరోజు తేడా ఉండడంతో రెండు కార్యక్రమాల్లో పాల్గొనడం తెలంగాణవాదులకు ఇబ్బందవుతుని భావించారు.
అలాగే టీజేఏసీతో గతంలో ఉన్న అంతర్గత పొరపొచ్చాలు మళ్లీ పొడచూపి తెలంగాణవాదుల్లో మరోవిధంగా సంకేతాలు వెళ్లే ప్రమాదమున్న దృష్ట్యా సభను వాయిదా వేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో శనివారం కెమిస్ట్రీ భవన్‌లో జరగనున్న టీఆర్‌ఎస్ జిల్లా సమావేశాన్ని వాయిదా వేసినట్లు పార్టీ జిల్లా అద్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తెలిపారు. తిరిగి బహిరంగసభతో పాటు పార్టీ సమావేశం ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామన్నారు.