విశాఖకు విశ్వ కుబేరుడు

Today Bill Gates Coming Visakhapatnam for Agri Hacktan Conference - Sakshi

సతీసమేతంగా నేడు బిల్‌ గేట్స్‌ రాక

సర్వం సిద్ధం.. సుందరంగా విశాఖ

నగరంలో ఉండేది రెండున్నర గంటలే

అగ్రిటెక్‌ సదస్సులో కీలకోపన్యాసం

అత్యంత గోప్యంగా పర్యటన వివరాలు

రాష్ట్ర అతిధిగా ప్రొటోకాల్‌ మర్యాదలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిగా విలసిల్లుతున్న విశాఖ నగరానికి ప్రపంచ కుబేరుడుగా ప్రసిద్ధికెక్కిన బిల్‌గేట్స్‌ తొలిసారి విచ్చేస్తున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా మన దేశానికి చెందిన అత్యంత ప్రముఖులు, విదేశాలకు చెందిన విశిష్ట వ్యక్తులు విశాఖకు విచ్చేసిన చరిత్ర ఉంది. కానీ ప్రపంచ స్థాయి కుబేరుడు రావడం మాత్రం ఇదే తొలిసారిగా పేర్కొంటున్నారు. నగరంలో నిర్వహిస్తున్న అగ్రి హ్యాక్‌థాన్‌ సదస్సు ముగింపు సదస్సులో శుక్రవారం బిల్‌గేట్స్‌ పాల్గొంటారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన పర్యటన వివరాలపై అధికారులు గోప్యత పాటిస్తున్నారు.

సేకరించిన సమాచారం ప్రకారం.. బిల్‌గేట్స్‌ ప్రస్తుతం లక్నోలో ఉన్నారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం ఉదయం బెంగళూరుకు వెళ్లి.. మధ్యాహ్నం 2గంటల సమయంలో విశాఖ చేరుకుంటారని తెలుస్తోంది. ఆయన వెంట భార్య మిలింద కూడా వస్తారని చెబుతున్నారు. విమానాశ్రయం నుంచి బీచ్‌రోడ్డులోని నోవోటెల్‌కు వెళ్తారు.  ఆ తర్వాత అగ్రిహ్యాకథాన్‌ సదస్సులో పాల్గొని కీలకోపన్యాసం చేస్తారు. రైతులు, శాస్త్రవేత్తలతో ముచ్చటిస్తారు. అనంతరం 4.30 గంటల సమయంలో తిరుగు ప్రయాణమవుతారు. బిల్‌గేట్స్‌ రాకను పురస్కరించుకుని నగరాన్ని అధికారులు మరింత సుందరంగా తీర్చిదిద్దారు. విమానాశ్రయం నుంచి అగ్రి హ్యాకథాన్‌ సదస్సు ప్రాంగణం వరకు ఆయన ప్రయాణించే మార్గంలో రోడ్లను సుందరంగా తీర్చిదిద్దారు.

బోలెడన్ని ఆశలు
అగ్రిహ్యాకథాన్‌ సదస్సులో బిల్‌గేట్స్‌ రైతాంగానికి, వ్యవసాయ రంగానికి మేలు చేకూర్చే ప్రకటన చేస్తారని అంతా ఆశతో ఉన్నారు. వ్యవసాయ రంగంలో సహకరించడానికి బిల్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌తో ఇప్పటికే అగ్రి హ్యాకథాన్‌ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుం ది. ఈ ఫౌండేషన్‌ ఆఫ్రికాలో వ్యవసాయ రంగంతో పాటు టెక్నాలజీ, ప్రాజెక్టులకు సాయమందిస్తోంది. అక్క డ అవి మంచి ఫలితాలిస్తున్నాయని చెబుతున్నారు. మన రాష్ట్రం లో కూడా ఈ ఫౌండేషన్‌ తరఫున వివిధ ప్రాజెక్టుల కు సాయం అందుతుందన్న ఆశాభావంతో పాలకులున్నారు. 

ఎవరీ బిల్‌గేట్స్‌
బిల్‌గేట్స్‌గా అందరికీ తెలిసిన మూడో విలియం హెనీ గ్రేట్స్‌ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కంపెనీ అధినేత. మూడు దశాబ్దాల క్రితం మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ను స్థాపించి కంప్యూటర్లను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చిన వ్యక్తిగా చరిత్ర సృష్టించిన బిల్‌గేట్స్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో ధనవంతుడిగా రికార్డులకెక్కారు. 1999లో బిల్‌గేట్స్‌ ఆస్తి విలువ 101 బిలియన్లకు చేరుకున్నప్పుడు అందరూ బిల్‌గేట్స్‌ను మొట్టమొదటి సెంట్‌ బిలియనీరు అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏర్పడిన ఆర్ధిక మాంద్యం వల్ల ఆ విలువ తగ్గుతూ వచ్చినప్పటికీ 2006 వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత సేవా కార్యక్రమాల వైపు మళ్లిన ఆయన 2008 జూన్‌లో బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ పేరుతో చారిటబుల్‌ ట్రస్ట్‌ను స్థాపించారు. మన రాష్ట్రంలో వ్యవసాయానికి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించే అంశంపై బిల్‌ మిలిందా గేట్స్‌ సంస్థతోనే ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. సమైక్య రాష్ట్రంలో బిల్‌గేట్స్‌ హైదరాబాద్‌కు ఒకటిరెండుసార్లు వచ్చినప్పటికీ నవ్యాంధ్రకు రావడం ఇదే తొలిసారి.

ప్రభుత్వ అతిధిగా ఏర్పాట్లు స్వాగతించేందుకు సీఎం ఎయిర్‌పోర్టుకు వెళ్తారా..?
బిల్‌గేట్స్‌ను రాష్ట్ర అతిధిగానే గౌరవ మర్యాదలు అం దిస్తున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి, మినిస్ట్రీ ఆఫ్‌ హోమ్‌ అఫైర్స్‌ చీఫ్‌కు మాదిరిగానే ఆయనకు కూడా సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీ స్‌ అధికారులు తెలిపారు. కాగా, ఆయనకు స్వాగతం పలికేందుకు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. అయితే, ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు సైతం ఎయిర్‌పోర్టు వెళ్తారా అన్నదేఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కట్టుదిట్టమైన భద్రత
గోపాలపట్నం: మైక్రోసాఫ్ట్‌ సంస్ధ అధినేత బిల్‌గేట్స్‌ శుక్రవారం విశాఖ రానున్న నేపధ్యంలో అధికార యంత్రాంగం అప్రతమత్తమయింది. గురువారం నాటికే విశాఖకు అమెరికా నుంచి ప్రత్యేక భధ్రతా బలగాలు చేరుకున్నాయి. బాంబ్, డాగ్‌ స్క్వాడ్‌ల తనిఖీలు చేశారు. అగ్రిహాకధాన్‌ సదస్సుకు హాజరయిన కేంద్ర వ్యవసాయశాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ గురువారం రాత్రి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top