ఇదో టాస్క్ ‘ఫార్స్’ | Tirupati center of Task Force | Sakshi
Sakshi News home page

ఇదో టాస్క్ ‘ఫార్స్’

Nov 20 2014 4:13 AM | Updated on Sep 2 2017 4:45 PM

ఇదో టాస్క్ ‘ఫార్స్’

ఇదో టాస్క్ ‘ఫార్స్’

ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేం దుకంటూ గతంలో ఏర్పాటు చేసిన రెండు టాస్క్‌ఫోర్స్‌లను నిర్వీర్యం చేసి ఇప్పుడు తిరుపతి కేంద్రంగా మరో టాస్క్‌ఫోర్స్ అంటూ ప్రకటనలు గుప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

* ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టపై వెనకడుగు
* ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై కేసులకే ప్రాధాన్యం
* రాజకీయ ఒత్తిళ్లతో తిరుపతి, చిత్తూరు టాస్క్‌ఫోర్సులు నిర్వీర్యం

సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేం దుకంటూ గతంలో ఏర్పాటు చేసిన రెండు టాస్క్‌ఫోర్స్‌లను నిర్వీర్యం చేసి ఇప్పుడు తిరుపతి కేంద్రంగా మరో టాస్క్‌ఫోర్స్ అంటూ ప్రకటనలు గుప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సొంత జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌లను ప్రతి పక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టేందుకు అధికార పార్టీ ఉపయోగిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మెలిగి చంద నం స్మగ్లర్లకు సైతం సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

ఉన్న టాస్క్‌ఫోర్సులకు అధికారం,స్వేచ్ఛ ఇవ్వని ప్రభుత్వం మరో టాస్క్‌ఫోర్సు అంటూ ఏదో చేస్తున్నామన్న భ్రమ కల్పించే ప్రయత్నానికి దిగడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తిరుపతి, చిత్తూరులలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్సుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ టాస్క్‌ఫోర్సు లు దాదాపు నిర్వీర్యమయ్యే పరిస్థితికి వచ్చాయి.
 
రెండు టాస్క్‌ఫోర్సులు నిర్వీర్యం..
చిత్తూరు, వైఎస్‌ఆర్, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో చందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు గతేడాది జూన్ 25న ప్రభుత్వం తిరుపతి కేంద్రంగా టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేసింది. అటవీశాఖాధికారులను డెప్యూటేషన్‌పై టాస్క్‌ఫోర్సులో నియమించారు. డీఎస్పీ స్థాయి అధికారిని ఓఎస్‌డీగా నియమించారు. ఏడాది పాటు పనిచేసిన ఈ టాస్క్‌ఫోర్స్ చందనం అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయింది.

చందనం అక్రమ రవాణాకు సహకరించాడంటూ ఓఎస్‌డీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తరువాత టాస్క్‌ఫోర్సు నుంచి కొందరు అధికారులు, సిబ్బంది తప్పుకుని మాతృశాఖకు వెళ్లిపోయారు. ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయకపోవడంతో ఆ టాస్క్‌ఫోర్సు నిర్వీర్యమైపోయింది. ఈ ఏడాది  ప్రారంభంలో చిత్తూరు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో కొందరు అధికారులను బదిలీ చేయడంతో మిగిలిన వారు దూకుడు తగ్గించారు.

చిత్తూరు టాస్క్‌ఫోర్స్‌కు ఓఎస్డీగా వ్యవహరిస్తున్న ఐపీఎస్ అధికారి రత్న సెలవుపై వెళ్లడం అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా ఉంది. నాలుగు నెలలుగా శేషచలం అడవుల్లో కొనసాగిన ప్రత్యేక దళాల హడావుడి తగ్గంది. తమిళనాడు నుంచి జిల్లాకు ప్రవేశించే మార్గాలలో గతంలో ఏర్పాటు చేసిన 13 ఔట్‌పోస్టులను ఎత్తివేశారు. ఉన్న టాస్క్‌ఫోర్సులను పనిచేయనివ్వకుండా చేసి కొత్త టాస్క్‌ఫోర్సులతో ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement