
తిరుమలలో శాశ్వతంగా మూడు క్యూలు
తిరుమల శ్రీవారి ఆలయంలో తోపులాటకు అవకాశం లేకుండా కొత్తగా ప్రవేశపెట్టిన మూడు క్యూల విధానాన్ని ఇకపై శాశ్వతంగా అమలు చేస్తామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ తెలిపారు.
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో తోపులాటకు అవకాశం లేకుండా కొత్తగా ప్రవేశపెట్టిన మూడు క్యూల విధానాన్ని ఇకపై శాశ్వతంగా అమలు చేస్తామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ తెలిపారు. శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో శ్రీనివాసరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ కొత్త విధానం వల్ల భక్తులకు సంతృప్తికరంగా స్వామిని దర్శించుకునే అవకాశం లభిస్తోందన్నారు. రోజులో స్వామిని సేవించే భక్తుల సంఖ్య కూడా పెరిగిందని తెలిపారు. అందువల్ల దీనిని ఇక నుంచి శాశ్వతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రికీ ప్రొటోకాల్ వర్తిస్తుంది: ఈవో
ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణ సీఎంతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకూ ప్రొటోకాల్ మర్యాదలు కల్పిస్తామని ఈవో గిరిధర్ గోపాల్ అన్నారు. ప్రముఖులకు మర్యాదలు కల్పించటంలో ఎలాంటి అపచారమూ లేదని పేర్కొన్నారు. వారి సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు.