తగ్గిపోయిన అల్లం సాగు | The reduction in the cultivation of ginger | Sakshi
Sakshi News home page

తగ్గిపోయిన అల్లం సాగు

Dec 17 2013 1:14 AM | Updated on Sep 2 2017 1:41 AM

ఏళ్ల తరబడి గిరిజనులకు ఆర్థిక భరోసా ఇచ్చిన అల్లం పంట క్రమేపీ కనుమరుగవుతోంది. సాగు విస్తీర్ణంగా ఏటా గణనీయంగా తగ్గిపోతోంది.

అరకులోయ, న్యూస్‌లైన్: ఏళ్ల తరబడి గిరిజనులకు ఆర్థిక భరోసా ఇచ్చిన అల్లం పంట క్రమేపీ కనుమరుగవుతోంది. సాగు విస్తీర్ణంగా ఏటా గణనీయంగా తగ్గిపోతోంది. వాణిజ్య పంటల్లో ఒకటైన అల్లాన్ని గిరిజనులు విస్తారంగా సాగు చే సేవారు. ఆ పంటను విక్రయించిన సొమ్ముతోనే సంక్రాతి పండుగ సమయంలో పశువులు, కొత్త బట్టలు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేవారు. ప్రతి గిరిజనుడు తమకున్న భూమిలో రెండు మూడు మళ్లు ప్రత్యేకంగా అల్లం పంట కోసం కేటాయించేవారు.

కేవలం సేంద్రియ ఎరువులతోనే పండించడం వల్ల ఇక్కడ సాగు చేసిన అల్లానికి మైదానం ప్రాంతాల్లో ఎంతో డిమాండ్ ఉంది. మైదాన ప్రాంత వ్యాపారులు నేరుగా గిరిజన గ్రామాలకు వెళ్లి రైతుల నుంచి నేరుగా టన్నుల కొద్దీ అల్లాన్ని కొనుగోలు చేసి లారీలు, వ్యానుపై విశాఖ, ఎస్.కోట, విజయనగరం తదితర ప్రాంతాలకు తరలించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఐదారు సంవత్సరాల నుంచి అల్లం పంట విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. మొదట్లో కిలో అల్లం ధర రూ.10 నుంచి రూ.20ల ధర ఉండేది. గత ఏడాది రూ.40 నుంచి రూ.50 వరకూ వ్యాపారులు కొనుగోలు చేశారు.  కనీవినీ ఎరుగని రీతిలో ఇటీవల అల్లం కిలో ధర రూ.200 వరకూ పలికింది. ప్రస్తుతం రూ.40 నుంచి రూ.60 వరకూ ధర ఉన్నప్పటికీ రైతులు పెద్దగా అల్లం పంట సాగు చేయకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు.
 
గతంలో ఐటీడీఏ అధికారులు గిరిజనులు అల్లం పంట సాగుపై చూపుతున్న శ్రద్ధను గమనించి సబ్సిడీపై మేలు రకం అల్లం విత్తనాలను అందజేసి ప్రోత్సహించింది. ఇప్పుడా ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఐటీడీఏ అల్లం విత్తనాలు సరఫరా చేయడం మొదలు పెట్టడంతో గిరిజనులు ఇంటి వద్ద విత్తనాలు భద్ర పరచుకోవడం మానేశారు. ఐటీడీఏ విత్తనాల సరఫరా నిలిపి వేయడంతో రైతుల వద్ద అల్లం విత్తనం కరువైంది. అప్పటి నుంచి అల్లం విస్తీర్ణం పూర్తిగా పడిపోయింది. ప్రతి గ్రామంలో అడుగడుగున దర్శనమిచ్చే అల్లం పంట ఇప్పుడు ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది. నూటికి ఇద్దరు ముగ్గురు రైతులు సాగు చేస్తున్నారు.

దాదాపు 97 శాతం మంది రైతులు అల్లం సాగు చేయడం మానేయడంతో డిమాండ్ ఏర్పడింది. మన్యంలో ఏ గిరిజనుడి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఇంట్లో నిల్ల చేసిన అల్లాన్ని  వినియోగించుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. వారే కూరగాయలు, కిరాణా దుకాణాలు ఆశ్రయించి అధిక ధరకు అల్లం కొనుక్కోవాల్సివస్తోంది. ఐటీడీఏ అధికారులు స్పందించి తమను ఆర్థికంగా ఆదుకునే అల్లం పంట సాగు చేసేందుకు గతంలో మాదిరిగానే సబ్సిడీపై మేలు రకం అల్లం విత్తనాలు సరఫరా చేయాలని గిరిజన రైతులు కోరుతున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement