మంత్రి పరిటాల సునీత అనుచరుల హల్‌చల్ | The minister Paritala Sunita followers Hulchul | Sakshi
Sakshi News home page

మంత్రి పరిటాల సునీత అనుచరుల హల్‌చల్

Mar 25 2015 9:29 PM | Updated on Sep 2 2017 11:22 PM

మంత్రి పరిటాల సునీత అనుచరులు మరోసారి తమ దుందుడుకును ప్రదర్శించారు.

అనంతపురం రూరల్: మంత్రి పరిటాల సునీత అనుచరులు మరోసారి తమ దుందుడుకును ప్రదర్శించారు. ఏకంగా తహశీల్దార్(మండల మెజిస్ట్రేట్) షేక్‌మహబూబ్ బాషాను కొట్టేందుకు టీడీపీ మాజీ ఎంపీటీసీ కాట్నేకాలువ శ్రీనివాసులు యత్నిచండం పెద్ద దుమారం రేపింది. వీరి వెంట టీడీపీ మండల కన్వీనర్ పామురాయి వెంకటేశ్, ఎంపీపీ భర్త రవీంద్ర, పలువురు నేతలున్నారు. స్వయంగా తహశీల్దార్ చాంబర్‌లోనే ఆయనపై చేయి చేసుకునేందుకు వెళ్లడంతో ఉద్యోగులు ఒక్కసారిగా హడలెత్తారు. తహశీల్దార్‌పై దాడికి యత్నించేందుకు వెళ్లిన టీడీపీ మాజీ ఎంపీటీసీను డిప్యూటీ తహశీల్దార్ కుమారస్వామి, ఆర్‌ఐ సంజీవరెడ్డి, వీఆర్‌ఓలు, అడ్డుకున్నారు. వారు లేకుండా ఆయనపై చేయి చేసుకునే పరిస్థితి ఏర్పడేది. అనంతపురం తహశీల్దార్ కార్యాలయంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగిన సంఘటనపై అక్కడ పనిచేసే కింది స్థాయి అధికారులు, వీఆర్‌ఓలు, మైనార్టీ సంఘాలు పెద్ద ఎత్తున ధ్వజమెత్తాయి. దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోతామంటూ నినాదాలు చేశారు.


నిజాయితీగా వ్యవహరించినందుకేనా..
బుధవారం ఉదయం టీడీపీ నేతుల పామురాయి వెంకటేశ్, కాట్నేకాలువ శ్రీనివాసులు, ఎంపీపీ భర్త రవీంద్ర తహశీల్దార్‌తో కలిసేందుకు వచ్చారు. తమకు చెందిన వారి పట్టాను ఎందుకు రద్దు చేశారంటూ వాదనకు దిగారు. అందుకు సదరు అధికారి నిబంధనలకనుగుణంగా చేయాల్సి వచ్చిందని వివరించారు. నడిమవంక జన్మభూమి రోడ్డు వద్ద 9 సెంట్లలో ఆరు కుటుంబాలు రోడ్డును ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్నాయన్నారు. దీనిపై అక్కడ హౌస్‌సైట్ లబ్దిదారులు రాస్తాకు ఇబ్బంది అవుతుందని ఫిర్యాదు చేశారన్నారు. అక్కడ నివాసమంటున్న వారు కేసీ రామక్క, కేసీ నరసింహులు, ఎం పద్మావతి, సువర్ణమ్మ, తదితరులకు పలు చోట్ల వారి పేర్లపై పట్టాలున్నాయని తేలిందన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి రైట్ ఇన్‌ఫర్మేషన్ యాక్ట్ కింద వివరాలను జతచేశారన్నారు. నెల క్రితం దీనిపై మునిసిపల్ కమిషనర్ ను కలసి విచారణ చేపట్టి, రోడ్డును వెడల్పు చేయడంతో భాగంగా పట్టాలు రద్దు చేశామన్నారు. వాస్తవంగా వీరికి ముందుగానే పట్టాలున్నాయని అందుకే చేయాల్సి వచ్చిందన్నారు. అందరూ బంధుమిత్రులేనని ఇలాంటప్పుడు తామేమి చేయగలమన్నారు.


పేక్షక పాత్ర పోషించిన టీడీపీ నేతలు
మాజీ ఎంపీటీసీ కాట్నేకాలువ శ్రీనివాసులు ఏం మా ప్రభుత్వంలో మాకు న్యాయం చేయకపోతే ఎలా..? ఎవరు చెబితే రద్దు చేశారు..
మొదట వాటికి పట్టాలు తిరిగి మంజూరు చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో తహశీల్దార్ అధికారులతో మాట్లాడుకోవడం నేర్చుకోవాలాన్నారు. నీవెంత, మేం చెబితే చేయాల్సిందే.. ఏం ఏమనుకున్నావ్. జాగ్రత్త.. నీ కథ చెబుతా అంటూ తహశీల్దార్‌పై దాడికి దిగాడు. అక్కడ ఉన్న టీడీపీ నేతలు ప్రేక్షక పాత్ర వహించారు. కార్యాలయం సిబ్బంది లేకుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది.


ఆవేదన వ్యక్తం చేసిన తహశీల్దార్
దాడిపై తహశీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోతానన్నారు. తను ఏ తప్పు చేయకున్నా దుర్భాషలాడడం ఎంత వరకు సమంజసమన్నారు. దీనికి తోడు కొట్టేందుకు రావడం సరికాదన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

తీటౌన్‌లో ఫిర్యాదు
తహశీల్దార్, కార్యాలయంలో సిబ్బంది జరిగిన సంఘటనపై టీడీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాట్నేకాలువ శ్రీనివాసులపై త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుర్భాషలాడడంతో పాటు, కొట్టేందుకు వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఐఎంఎం ధర్నా
దాడి ఘటనపై ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్ బాషా నేతృత్వంలో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. నిందితులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మైనార్టీల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారన్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులపై దాడి చేయడం తగదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement