స్వైన్‌కు ముకుతాడేదీ.. | The government does not care disease | Sakshi
Sakshi News home page

స్వైన్‌కు ముకుతాడేదీ..

Feb 19 2015 12:56 AM | Updated on Sep 2 2017 9:32 PM

‘స్వైన్‌ఫ్లూ’ వైరస్ 2009లో విశాఖలో అడుగుపెట్టి నేటికీ ప్రజలను పట్టిపీడిస్తోంది.

వ్యాధి విజృంభిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం
నియంత్రణకు  మందులు లేవంటున్న వైద్యులు
వస్తే చికిత్సకు ఢోకా లేదంటూ మరో మాట
{పజల్లో అవగాహనకు ప్రచారం కరువు
కేసుల వివరాలు బయటపెట్టని కార్పొరేట్ ఆస్పత్రులు

 
విశాఖపట్నం/విశాఖ మెడికల్:    ‘స్వైన్‌ఫ్లూ’ వైరస్ 2009లో విశాఖలో అడుగుపెట్టి నేటికీ ప్రజలను పట్టిపీడిస్తోంది. ఈ ఏడాది జనవరిలో విజృంభించి ఇప్పటి వరకూ జిల్లాలో 15 మందికి సోకింది. అయినా ఇంత వరకూ ఈ వ్యాధి నియంత్రణకు, చికిత్సకు మందులేమున్నాయనే దానిపై సాక్షాత్తూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకే స్పష్టత లేదు. వ్యాధి సోకుండా ఏ మందులు వాడాలో ఏ వైద్యులు చెప్పడం లేదు. వచ్చిన తర్వాత చికిత్సకు కచ్చితమైన పద్ధతులు లేవు. ఈ పరిస్థితుల్లో ఎవరికి తోచిన సలహాలు వారు ఇవ్వడం మినహా ప్రజలకు ఖచ్చితమైన అవగాహన, సమాచారం ఉండటం లేదు. స్వైన్‌ఫ్లూ రాకుండా అల్లోపతిలో మందులు లేవని, హోమియోపతిలో ఉన్నాయోలేవో కూడా తమకు తెలియదని సాక్షాత్తూ డిఎంఅండ్ హెచ్‌ఓ జె.సరోజిని ప్రకటించారు. హోమియో మందులు వాడితే వ్యాధి రాదంటూ ప్రచారం చేసుకుని కొందరు లాభపడుతున్నారు. ప్రజలు కూడా వాడితే పోయేదేముందని హోమియో మందులు ఎగబడి  కొంటున్నారు. అవి ఖచ్చితంగా వ్యాధిని అడ్డుకుంటాయనే శాస్త్రీయ నిరూపణలైతే ఎక్కడా లేవని వైద్యులు అంటున్నారు. వ్యాధి సోకిన తర్వాత  అల్లోపతి విధానంలో చికిత్సకు మందులు ఉన్నాయని చెబుతున్న వైద్యులు టామీఫ్లూ మాత్రలు మాత్రమే రోగికి అందిస్తున్నారు. వాటితో పాటు వ్యాధి నిరోధక శక్తిని పుంచే మందులు ఇస్తున్నారు.

అంతకు మించి గట్టి చికిత్స అంటూ ఏమీ లేదు. వ్యాధి రాకుండా ఉండాలంటే అల్లోపతిలో వ్యాక్సిన్ ఉందని చెబుతున్నా దాని వల్ల వ్యాధి రాదనే గ్యారెంటీ లేదని వైద్యులే అపనమ్మకం వ్యక్తం చేస్తున్నారు.స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరితే సాధారణ జులుబు,జ్వరాలకు ఇచ్చే చికిత్సను, మందులను అందించి సరిపెడుతున్నారు. వ్యక్తి గత జాగ్రత్తలు, పరిశుభ్రత పాటించాలని ఉచిత సలహా ఇస్తున్నారు. నగరంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కుప్పలు తెప్పలుగా స్వైన్‌ఫ్లూ నిర్ధారిత, అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. పేద వర్గాలకు చెందిన వారు మాత్రమే కేజీహెచ్, ప్రభుత్వ ఛాతి ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంపన్న వర్గాల వివరాలను కార్పొరేట్ వర్గాలు గోప్యంగా ఉంచుతున్నాయి. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కూడా దృష్టి సారించడం లేదు. దీనివల్ల జిల్లాల్లో వాస్తవంగా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందనే అంచనాలు అందడం లేదు. ఫలితంగా వ్యాధి అదుపులోకి రాకపోగా రోజు రోజుకి విజృంభిస్తోంది. వైరస్ వ్యాప్తిపై వైద్య ఆరోగ్యశాఖ, జీవీఎంసీ ప్రజారోగ్య విభాగాలు నిర్లక్ష్య ధోరణిని అనుసరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మాస్ మీడియా ప్రచారానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రజల్ని అప్రమత్తం చేయాలని పదే పదే ఆదేశిస్తున్నప్పటికీ,  నిధులు ఎంత ఖర్చు అయినా వెనుకాడొద్దని మంత్రులు చెబుతున్నప్పటికీ అధికారులు పెడచెవిన పెడుతున్నారు. ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. అరకొరగా కరపత్రాలు ముద్రించి, పలు ప్రాంతాల్లో సర్వే చేసి అంతా చేసేశామంటూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో మురికి వాడల్లో వ్యాధి వేగంగా విస్తరిస్తోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement