ఆగస్టు ఒకటో తేదీ నుంచి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ మార్కెట్ విలువలు పెంచి అన్ని వర్గాల ప్రజలను బెంబేలెత్తిస్తోంది
ఇక స్థలాల రిజిస్ట్రేషన్లూ భారమే
మార్కెట్ విలువ పెంపుతో అవస్థలు
ఇరవై నుంచి నూరు శాతం వరకూ పెంపు
ఒంగోలు సబర్బన్ : ఆగస్టు ఒకటో తేదీ నుంచి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ మార్కెట్ విలువలు పెంచి అన్ని వర్గాల ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఈ నిర్ణయంతో జిల్లా ప్రజలపై ప్రతి ఏడాదికి రూ.20 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఈ పెంపు వల్ల రిజిస్ట్రేషన్ల శాఖకు రెట్టింపు ఆదాయం సమకూరనుంది. గతంలో ఉన్న మార్కెట్ విలువలకంటే కొన్ని ప్రాంతాల్లో నూరు శాతం పెరగగా మరికొన్ని చోట్ల 50 శాతం పెరగనున్నాయి.
స్థిరాస్తి వ్యాపారం జోరుగా ఉన్న సమయంలో భూముల విలువలు విపరీతంగా దళారులు పెంచిన విషయం తెలిసిందే. గత ఐదారు సంవత్సరాలుగా ఈ వ్యాపారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందంగా తయారైంది. చివరకు అప్పుల్లోళ్ళకు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవటంతో ఐపీలు కూడా పెట్టారు. ఈ పరిస్థితుల్లో స్థలాల, భూములు, నిర్మాణాల మార్కెట్ విలువలు పెంచటంతో అయోమయ పరిస్థితి నెలకొంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఒంగోలు, మార్కాపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదాయ లక్ష్యం రూ.18.10 కోట్లుంటే ప్రస్తుతం పెంచిన ధరలతో ఒకేసారి రూ.38 కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.