అగ్ని ప్రమాదంలో ఏడు పూరిళ్లు దగ్ధం | Thatched houses burnt in fire accident | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదంలో ఏడు పూరిళ్లు దగ్ధం

Aug 31 2013 5:02 AM | Updated on Sep 5 2018 9:45 PM

నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని థామస్‌పేటలో గరువారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు పూరిళ్లు,ఎస్.కోట మండలంలోని గోపాలపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి.

నెల్లిమర్ల రూరల్, న్యూస్‌లైన్ : నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని థామస్‌పేటలో గరువారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు పూరిళ్లు,ఎస్.కోట మండలంలోని గోపాలపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు పూరిళ్లు  దగ్ధమయ్యాయి. నెల్లిమర్లలో నక్కా మహాలక్ష్మి ఇంట్లో విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో మారోతు రామారావు, పతివాడ ఆదినారాయణ, జడగాల సూర్యనారాయణ, పత్తిగిళ్ల అప్పలస్వామి ఇళ్లు పూర్తిగా బూడిదయ్యాయి. ఈ ప్రమాదం జరిగినపుడు మహాలక్ష్మి కుటుంబం తమ బంధువుల ఇంటిలోని పెళ్లికి హాజరవడానికి వెళ్లడంతో ఆ ఇంటిలోని బీరువా, నాలుగు తులాల బంగారం, ఇతర సామగ్రి, కొంత నగదు కాలిపోయాయి. మిగిలిన వారిళ్లలో కూడా కొంతమేర నష్టం వాటిల్లింది. స్థానికులు స్పందించి అగ్నిని ఆర్పేందుకు ప్రయత్నం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం మేరకు అగ్నిమాపక శకటం రావడంతో మంటలను ఆర్పివేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.  కట్టు బట్టలతో మిగిలిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
 
 బాధితులకు వైఎస్‌ఆర్‌సీపీ నేత బియ్యం పంపిణీ
 అగ్ని ప్రమాద బాధితులకు వైఎస్సార్‌సీపీ నాయకుడు జనా ప్రసాద్ ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్య్రమంలో పాల్గొన్న ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు బాధితులను  ఓదార్చారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన న్యాయం జరిగేలా చూస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు.
 
 గోపాలపల్లిలో..
 గోపాలపల్లి (శృంగవరపుకోట రూరల్),న్యూస్‌లైన్: గోపాలపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు పూరిళ్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో గేదెల పైడిరాజు, సమ్మంగి బంగారయ్యలకు చెందిన కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. బాధితులు, స్థానికులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. గేదెల పైడిరాజు పూరింటి నుంచి మంటలు ఎగసిపడి పక్కనే ఉన్న సమ్మంగి బంగారయ్య ఇంటికి వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు స్థానిక యువకులు ప్రయత్నిస్తూనే ఎస్.కోటలోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు.  
 
 అగ్నిమాపక శకటం వచ్చేలోగానే రెండు పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో గేదెల పైడిరాజుకు చెందిన రూ.10వేల నగదు, రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, వస్తు సామగ్రి కాలిపోయాయి. సమ్మంగి బంగారయ్య ఇటీవలనే ఆవు అమ్మగా వచ్చిన సొమ్ము రూ.30వేలు, వస్తు సామాగ్రి, ఆధార్, రేషన్‌కార్డులు, తిండి గింజలు కాలి బూడిదయ్యాయి. మొత్తంగా రూ.80వేల ఆస్తినష్టం జరిగినట్టు గ్రామస్తుల అంచనా. ఆ రెండు కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.  అగ్ని ప్రమాద బాధితులను గ్రామపెద్దలు రమణరాజు, సురేష్‌రాజు, సర్పంచ్ పద్మావతి, ఉప సర్పంచ్ సత్యారావులు ఓదార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement