ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్రకు చెందిన ఏపీఎన్‌జీవో ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు.
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్రకు చెందిన ఏపీఎన్‌జీవో ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. టెట్‌ను ఈ నెల 9వ తేదీన నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్ష నిర్వహణకు ఉద్యోగులు సహకరించని నేపథ్యంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్)ను వాయి దా వేస్తున్నట్టు ప్రభుత్వం గురువారం రాత్రి ప్రకటించింది. ఫిబ్రవరి నెలాఖరులోగా నిర్వహిస్తామని మంత్రి పార్థసారథి ప్రకటించారు. దీం తో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
ఫిబ్రవరిలో రెవెన్యూ, ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ అర్హత పరీక్షలు ఉన్నాయని, అదే విధంగా తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అల్లర్లకు అవకాశం ఉండటంతో టెట్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని జనవరి 7వ తేదీన సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది.
వాయిదాల పర్వం
మొదట సెప్టెంబర్ 30 తేదీన నిర్వహించనున్నామని విద్యాశాఖ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో వాయిదా పడటంతో నవంబర్‌లో నిర్వహిస్తామని రెండోసారి ప్రకటించారు. రెండో ప్రయత్నంలో కూడా వాయిదా పడటంతో నిరుద్యోగులు నిరాశకు లోనయ్యారు. ఎట్టకేలకు మూడోసారి ఫిబ్రవరి 9న పరీక్ష నిర్వహిస్తున్నామని ప్రకటించి, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
మూడోసారి కూడ వాయిదా పడటంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వేలాది రూపాయలు వెచ్చించి శిక్షణ పొందిన అభ్యర్థులు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రకటన వెలువడే నాటికి 7,998 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.