ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు తెరపడింది. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఉద్యోగులు శుక్రవారం నుంచి విధులకు హాజరుకానున్నారు. జిల్లాలో సమ్మెను విరమిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. సమ్మె విరమించినా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిత్యం ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఉద్యమంలో 25 వేల మంది ఉద్యోగులు
సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్‌జీఓల ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 67 రోజుల పాటు కొనసాగింది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. ఎన్‌జీఓలతో పాటు జిల్లా గెజిటెడ్ అధికారులు, ఆర్టీసీ కార్మికులు, రెవెన్యూ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు, పంచాయతీరాజ్, వ్యవసాయశాఖ, నాలుగో తరగతి ఉద్యోగులు, న్యాయవాదులు ఇలా దాదాపు 70 విభాగాల ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 25 వేల మంది ఉద్యోగులు రెండు నెలల పాటు విధులు బహిష్కరించారు.
ఫలితంగా జిల్లాలో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించిపోయింది. రెండు నెలల పాటు కలెక్టరేట్, జిల్లాలోని ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ బోసిపోయాయి. సమ్మెకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడంతో ఉద్యోగులు మరింత ఉత్సాహంగా ఉద్యమాన్ని కొనసాగించారు. రెండు నెలల నుంచి ఎక్కడి ఫైళ్లు అక్కడే ఆగిపోయాయి. పలు అభివృద్ధి పనులు ముందుకు సాగలేదు. తొలుత ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. 10, 11వ తేదీల్లో ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు సమ్మె విరమించారు. అదే కోవలో ఎన్‌జీఓలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
ఉధృతంగా సాగిన ఉద్యమం
జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన వెంటనే మొదలైన ఉద్యమం జిల్లాలో గురువారం 79వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అటు ప్రజలు, ఇటు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమబాట పట్టారు. ఉద్యోగులు జీతాలను సైతం వదులుకొని సమైక్యాంధ్ర కోసం అలుపెరగని పోరాటం చేశారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి వంటి కార్యక్రమాలను ముందుండి నడిపించారు. రోడ్డు పక్కన చిరువ్యాపారం చేసుకునే వారి నుంచి ఆటో కార్మికులు, చెక్కపని, రిక్షా కార్మికులు, టైలర్లు, వివిధ సామాజికవర్గ ప్రజలు ఇలా ప్రతి ఒక్కరూ ఉద్యమానికి అండగా నిలిచారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెడితే మరోసారి మెరుపు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.
తలుపులు తెరుచుకోనున్న
కార్యాలయాలు ...
ఉద్యోగుల సమ్మెతో మూతబడిన ప్రభుత్వ కార్యాలయాల తలుపులు శుక్రవారం నుంచి తెరుచుకోనున్నాయి. జిల్లా పరిపాలన భవనం కలెక్టరేట్ తోపాటు, కార్పొరేషన్ కార్యాలయం, విద్యాశాఖ, జెడ్పీ, వ్యవసాయశాఖ, పశుసంవర్థకశాఖ పీఆర్, ఇరిగేషన్, ట్రెజరీ, రెవెన్యూ కార్యాలయాలు యాథావిధిగా పనిచేయనున్నాయి. రెండు నెలల పాటు పెండింగ్‌లో ఉన్న ఫైళ్లకు మోక్షం కలగనుంది.
భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకునే...
సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన ప్రజలకు ఎన్‌జీఓ అసోసియేషన్ నగర కమిటీ నాయకుడు నాసర్‌మస్తాన్‌వలి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకే సమ్మె విరమిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొనే సమ్మె చేసినట్లు వివరించారు. సమ్మెకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సమ్మె విరమించినా సమైక్యాంధ్ర ఉద్యమం ఆగదన్నారు. రాష్ట్ర నాయకత్వం నుంచి వచ్చే సూచనలకనుగుణంగా పలు రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తామని నాసర్‌మస్తాన్‌వలి పేర్కొన్నారు.