మాటు వేసి ఓటు తీస్తున్నారు

TDP Trying to Removed YSRCP Voters in West Godavari - Sakshi

వేల సంఖ్యలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

వైఎస్సార్‌ సీపీ ఓట్ల తొలగింపునకు కుట్ర

ఎఫ్‌–7ను దుర్వినియోగం చేస్తున్న అధికార పార్టీ నేతలు

జిల్లా వ్యాప్తంగా 55,062 దరఖాస్తులు

తప్పుడు ఫిర్యాదులపై కేసుల నమోదు చేస్తాం: జేసీ

పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో) : జిల్లాలో గత పదిరోజులుగా ఆన్‌లైన్‌లో ఓట్ల తొలగింపునకు సంబంధించి వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి. ఇవి నిత్యం వందల సంఖ్యలో రావడం విశేషం. వీటిలో అత్యధికంగా తప్పుడు దరఖాస్తులే. ఓటర్లకు తెలీకుండానే వారి పేరిట దరఖాస్తు చేస్తున్నవి అధికంగా ఉంటుండగా, అలాగే ఆయా ఓటర్లు స్థానికంగా నివాసం ఉండటం లేదనీ, ఇళ్లు ఖాళీ చేశారనే కారణాలు చూపించి, అభ్యంతరాలు చెబుతూ వారి ఓట్లు తొలగించాలంటూ మరికొన్ని దరఖాస్తులు వస్తున్నాయి. మొత్తానికి ఓటర్ల జాబితాలో ఉన్న వారిని అర్ధాంతరంగా తప్పించడమే లక్ష్యంగా ఇదంతా సాగుతోంది.

అధికార దుర్వినియోగం
నేషనల్‌ ఓటర్స్‌ సర్వీస్‌ పోర్టల్‌ (ఎన్వీఎస్పీ)ను పలువురు అధికార పార్టీ నాయకులు దుర్విని యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పోర్టల్‌లోకి వెళ్లి ఫామ్‌–7లో ఓటరు ఐడీ వివరాలు నమోదు చేసి, ఓటు తొలగించాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) పరిశీలించి ఆ పత్రాలలో పేర్కొన్నది నిజమైతే తొలగిస్తారు, లేకపోతే ఓటును కొనసాగిస్తారు. బీఎల్‌ఓలు ఏమి చేస్తారనేది పక్కన పెడితే ముందుగా టీడీపీ నాయకులు మాత్రం వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులు, ఇతరపార్టీల వారి ఓట్లను గుర్తించి తొలగించేందుకు ఎడాపెడా దరఖాస్తులు పెడుతున్నారు.

ఇంటర్‌నెట్‌ ద్వారా
ఎస్వీఎస్పీ పోర్టల్‌లో ఫామ్‌–7 ద్వారా ఓట్లు తొలగించాలనే దరఖాస్తులు జిల్లాలో 55,062 వచ్చాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల అధికారులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన పార్టీలకు రెండేసి సెట్లు చొప్పున ఓటర్ల జాబితాను గతంలో అందించారు.
అప్పటి నుండే అధికార పార్టీ తనకు దక్కని ఓట్లపై కన్నేసింది. అప్పటి నుండే తొలగింపు పర్వానికి తెరలేపింది. ఓటర్ల జాబితాలను పక్కనపెట్టుకుని అందులో అధికార పార్టీకి కచ్చితంగా ఓటు వేయరని భావించే వారిని లక్ష్యంగా చేసి వారి ఓటు తొలగించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆచంట నియోజకవర్గంలోని 190 బూత్‌ల్లో ఆరువేలకు పైగా ఓట్లు తొలగించాలంటూ ఎఫ్‌–7తో  దరఖాస్తులు చేశారు. నియోజకవర్గంలోని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ కన్వీనర్ల పేరుతో ప్రతీ బూత్‌లోనూ 20 నుంచి 35 వరకూ ఎఫ్‌–7 దరఖాస్తులు వచ్చాయి. అయితే అసలు వైసీపీ కన్వీనర్లకు, ఈ ఎఫ్‌–7లకు అసలు సంబంధమే లేకపోయినా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై బురద జల్లడానికి టీడీపీ నేతలే దీనికి శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. ఎఫ్‌–7 దరఖాస్తులకు తమకు ఎటువంటి సబంధం లేదని మండలాలు, గ్రామాల వారీగా రెవెన్యూ అధికారులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వినతి పత్రాలు సమర్పించింది.  అయినా దుష్ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టడానికి అధికార పక్షం సన్నాహాలు చేస్తోంది.
తణుకు నియోజకవర్గంలోని తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో కొందరి ఓట్లు తొలగించాలని ఆయా గ్రామాల్లో వైసీపీ బూత్‌ కన్వీనర్ల పేరుతో అధికారులకు విజ్ఞప్తులు అందుతున్నాయి. అయితే ఈ విజ్ఞప్తులన్నీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బూత్‌ కన్వీనర్ల పేర్లతో రావడం గమనార్హం.
దరఖాస్తులు వివరాలు
కొవ్వూరు నియోజకవర్గంలో 3,748, నిడదవోలు 438, ఆచంట 5,700, పాలకొల్లు 5,525, నర్సాపురం 5,412, భీమవరం 7,570, ఉండి 589, తణుకు 2,930, తాడేపల్లిగూడెం 2,071, ఉంగుటూరు 1,836,  దెందులూరు1,742, ఏలూరు 2,883, గోపాలపురం 7,468, పోలవరం 744, చింతలపూడి 6,406 ఇలా మొత్తం 55,062 దరఖాస్తులు వచ్చాయి.
ఆచంట మండలంలో జక్కంశెట్టి వెంకటేశ్వరరావు ఓటు తొలగించాలని కోరుతూ అతనే ఎఫ్‌–7తో దరఖాస్తు చేసుకొన్నట్లు వచ్చింది. ఈ విషయమై రెవెన్యూ అధికారులు విచారణ చేయగా అసలు వాస్తవం బయటకు వచ్చింది. జక్కంశెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అసలు ఎఫ్‌–7తో దరఖాస్తు చేయనేలేదు. నా ఓటు హక్కును తొలగించేందుకు ఎవరో కావాలనే నా పేరుతో దరఖాస్తు చేసిఉంటారని వెంకటేశ్వరరావు వాపోతున్నారు.

తప్పుడు ఫిర్యాదులపై కేసులు
జిల్లాలో ఫామ్‌–7 ద్వారా ఓట్లు తొలగించాలని తప్పుడు ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమే. అయితే ఫామ్‌–7తో ఫిర్యాదులు అందాయనే ఉద్దేశంతో ఓటు తొలగించే అవకాశం లేదు. జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను పరిశీలించి విచారణ చేస్తున్నాం. మోసపూరితంగా ఫామ్‌–7ను దరఖాస్తు చేస్తే ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేయిస్తున్నాం. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓటు తొలగించాలంటే కలెక్టర్‌ ఆధ్వర్యంలో పరిశీలన తరువాతే అనుమతులు ఇస్తున్నాం. తప్పుడు దరఖాస్తులపై చర్యలు తప్పవు.  – ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్, జిల్లా అదనపు ఎన్నికల అధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top