మాజీ ఎంపీ శివప్రసాద్‌కు అంతిమ వీడ్కోలు

TDP Senior Leader Sivaprasad Funeral Completed in Chandragiri Chittoor  - Sakshi

నివాళులర్పించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి, భూమన

తిరుపతి రూరల్‌/తిరుపతి అర్బన్‌: చిత్తూరు మాజీ పార్లమెంట్‌ సభ్యుడు డాక్టర్‌ శివప్రసాద్‌ అంత్యక్రియలు ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అగరాలలో పూర్తి చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శివప్రసాద్‌ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన విషయం విదితమే. పార్టీలకతీతంగా నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మంత్రులు గల్లా అరుణకుమారి, అమరనాథ్‌రెడ్డి, లోకేష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, అమరరాజ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ గల్లా రామచంద్రనాయుడు, మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ తదితరులు నివాళులు అర్పించి శివప్రసాద్‌ కుటుంబాన్ని ఓదార్చారు. సాయంత్రం 4.01 గంటల సమయంలో తిరుపతి నుంచి ఊరేగింపుగా చంద్రగిరి మండలం అగరాల సమీపంలోని శివప్రసాద్‌ సొంత స్థలంలో ఖననం చేశారు. పెద్దల్లుడు వేణుగోపాల్‌ చేతుల మీదుగా అంత్యక్రియలు పూర్తి చేశారు.

బాల్య మిత్రుడిని కోల్పోయా..: చంద్రబాబు
బాల్య మిత్రుడు శివప్రసాద్‌ను కోల్పోవడం ఎంతో బాధాకరంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. తిరుపతి నగరంలోని ఎన్‌జీవో కాలనీలోని శివప్రసాద్‌ నివాసానికి చేరుకుని నివాళి అర్పించారు. ఆయనతో చిన్ననాటి స్నేహం నుంచి నాటి రాజకీయాలతో ముడిపడి ఉన్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. బాల్యంలో తాము ఇద్దరం తిరుపతిలో కలసి చదువుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత వైద్యవృత్తిలో ఉన్న ఆయన్ని తానే రాజకీయాల్లోకి ఆహ్వానించినట్లు చెప్పారు. కాగా చదువుకునే రోజుల నుంచి ఆయనకు నటనపై ఎంతో మక్కువ ఉండేదన్నారు. దాంతోనే బాల్యం నుంచి చక్కటి నాటకాలను ప్రదర్శించేవారని చెప్పారు.

పాడెను మోసిన ప్రభుత్వ విప్, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి
శివప్రసాద్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ప్రభుత్వ విప్, తుడా చైర్మన్‌ డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కన్నీరుపెట్టుకున్నారు. వైఎస్‌ రాజారెడ్డి అనుచరుడిగా, వైఎస్‌ రాజశేఖరరెడ్డి› ఆత్మీయుడిగా ఉన్న శివప్రసాద్‌తో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. పాడెను మోసి తన అభిమానాన్ని చాటుకున్నారు. త్వరలోనే శివప్రసాద్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top