సీబీఐ సమన్లపై స్పందించిన సుజనా

TDP MP Sujana Chowdary Response On CBI Summons - Sakshi

న్యూఢిల్లీ : సీబీఐ తనకు సమన్లు జారీ చేయడంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి స్పందించారు. సీబీఐ సమన్లలో పేర్కొన్నట్లుగా బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆ కంపెనీ గురించి తనకు ఏమాత్రం తెలియదని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ కంపెనీ వ్యవహారంలో బ్యాంకులకు కోట్ల రూపాయల నష్టం చేకూర్చినట్లు 2017లో సుజనా చౌదరిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ బెంగళూరు బ్రాంచ్‌ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై స్పందించిన సుజనా చౌదరి... ‘ సుజనా గ్రూప్‌ పేరిట లిస్ట్‌ అయిన సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, స్ల్పెండిడ్‌ మెటల్‌ ప్రాడక్ట్స్ లిమిటెడ్‌, న్యూయాన్‌ టవర్స్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో 2003 నుంచి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల్లో మాత్రమే కొనసాగాను. అక్టోబరు 2014 వరకు ఈ కంపెనీల్లో ఏవిధమైన యాజమాన్య బాధ్యతలు చేపట్టలేదు. అక్టోబరు తర్వాత నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల్లో కూడా కొనసాగలేదు. ఇక బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌ కంపెనీ వ్యవహారంలో సీబీఐ నాకు సమన్లు చేసింది. ఆ కంపెనీతో నాకు ఎటువంటి సంబంధం లేదు’ అని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా ఈ కేసుకు సంబంధించి సుజనా చౌదరికి చెందిన రూ. రూ.315 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీఈపీఎల్‌), దాని అధికారులపై సీబీఐ దాఖలు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఈ చర్య తీసుకుంది. ఆ సంస్థ అధికారులు 2010-2013లో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌లను ‘మోసగించడానికి’ నేరపూరిత కుట్రకు పాల్పడటంతో బ్యాంకులకు రూ.364 కోట్ల మేర నష్టం కలిగినట్లు ఈడీ పేర్కొంది. టీడీపీకి ఆర్థిక వనరుగా పేరొందిన సుజనా కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో కొంతకాలం మంత్రిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయనపై ఇప్పటికే డీఆర్‌ఐ, ఫెమా, సీబీఐ కేసులు ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top