కొత్త బైక్ కొనుగోలు చేయాలన్న విషయంలో తలెత్తిన వివాదం ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్య పురుగుమందు తాగడాన్ని అవమానంగా భావించిన భర్త కూడా తాగాడు.
సాక్షి, నల్లగొండ : కొత్త బైక్ కొనుగోలు చేయాలన్న విషయంలో తలెత్తిన వివాదం ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్య పురుగుమందు తాగడాన్ని అవమానంగా భావించిన భర్త కూడా తాగాడు. ఈ ఘటనలో భర్త చనిపోగా.. భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన నల్లగొండ పట్టణంలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గుర్రంపోడు మండలం బొల్లారానికి చెందిన తరి గోపాల్ (35) అదే మండలంలోని పోలీస్ స్టేషన్‌లో 8 ఏళ్లుగా హోంగార్డుగా పనిచేస్తున్నాడు.
ఇతనికి భార్య సుజాత, ఇద్దరు కూతుళ్లు, ఒక క కుమారుడు ఉన్నారు. కొత్త బైక్ కొనుగోలు చేయాలన్న విషయంలో భార్యభర్త మధ్య వివా దం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన సుజాత మంగళవారం పురుగుల మందు తాగింది. హుటాహుటిన ఆమెను నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆమెను చూడడానికి వచ్చిపోయే బంధువులు, స్నేహితులు ఘటన విషయం తెలుసుకున్నారు. ఈ క్రమంలో భర్త అవమానంగా భావించి నల్లగొండ-దుప్పలపలి దారిలో పురుగుల మందు తాగాడు. స్థానికులు చూసి ఆస్పత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. వన్‌టౌన్ ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.