
సీపీఎస్ రద్దు ఉద్యమానికి మద్దతు పలుకుతున్న పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు
విజయనగరం అర్బన్ : కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు కోరుతూ చేపడుతున్న ఉద్యమాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని పలువురు పదవీ విరమణ ఉపాధ్యాయులు ప్రకటించారు. ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు పలువురు పదవీ విరమణ ఉపాధ్యాయులు పేర్కొన్నారు. వచ్చే నెల 1న స్థానిక కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న ముట్టడి కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలుపుతామని తెలిపారు.
న్యాయపరమైన హక్కుల సాధన పోరాటాల వల్లే సాధ్యమని సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎ.సదాశివరావు అన్నారు. పదవీ విరమణ చెందిన ఉపాధ్యాయులు ఉద్యమానికి మద్దతు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి జేసీ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.కృష్ణ, పదవీ విరమణ చెందిన పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.