జేసీ ఘెరావ్ | students stop to collector | Sakshi
Sakshi News home page

జేసీ ఘెరావ్

Nov 14 2014 2:45 AM | Updated on May 29 2018 6:13 PM

వైఎస్‌ఆర్ క్రీడాపాఠశాల విద్యార్థుల ఆందోళనతో అట్టుడికింది. క్రీడాపాఠశాలలో ఇన్సూరెన్స్ సొమ్ము స్వాహాతో పాటు,

క్రీడా పాఠశాలలో ఐదు గంటల పాటు ఆందోళన
జాయింట్ కలెక్టర్‌కు చుక్కెదురు
జేసీని ముట్టడించి బైఠాయింపు
సూపర్‌వైజర్‌లపై చర్యలకు పట్టు
చర్యలు తీసుకుంటామన్న హామీతో ఆందోళన  విరమణ

 
వైవీయూ : వైఎస్‌ఆర్ క్రీడాపాఠశాల విద్యార్థుల ఆందోళనతో అట్టుడికింది. క్రీడాపాఠశాలలో ఇన్సూరెన్స్ సొమ్ము స్వాహాతో పాటు, సూపర్‌వైజర్‌ల దురుసు ప్రవర్తనపై విచారణాధికారిగా విచ్చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ రామారావుకు చుక్కెదురైంది. దాదాపు నాలుగు గంటలకు పైగా ఆయన్ను కదలనివ్వకుండా బైఠాయించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఘెరావ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కడప నగరంలోని వైఎస్‌ఆర్ క్రీడాపాఠశాలలో ఇటీవల చోటుచేసుకుంటున్న పలు సంఘటనలతో పాటు హాస్టల్ సూపర్‌వైజర్‌ల దురుసు ప్రవర్తనపై విచారణ కోరుతూ క్రీడాపాఠశాల విద్యార్థులు పాదయాత్రగా వెళ్లి కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. దీనిపై విచారణాధికారిగా జాయింట్ కలెక్టర్ రామారావును నియమించారు. ఈయన నాలుగు రోజుల క్రితం ఓమారు క్రీడాపాఠశాలకు వెళ్లి విచారించారు. తిరిగి గురువారం 10.45 గంటల సమయంలో మరోసారి పూర్తిస్థాయి విచారణ నిర్వహించేందుకు క్రీడాపాఠశాలకు వెళ్లారు. తొలుత కార్యాలయ సిబ్బందిని విచారిస్తున్న సమయంలో విద్యార్థి సంఘాలు ప్రవేశించడంతో సమస్య తీవ్రస్థాయికి చేరుకుంది.

వెంటనే క్రీడాపాఠశాల విద్యార్థులు ఆయన విచారిస్తున్న కార్యాలయాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. బయటకు వచ్చి బహిరంగ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో జాయింట్ కలెక్టర్ కార్యాలయం నుంచి వెలుపలికి వచ్చారు. జేసీ ఎక్కడ వెళ్లిపోతారోనని ఆయన కారు చుట్టూ అడ్డంగా విద్యార్థులు బైఠాయించారు. దీంతో జాయింట్ కలెక్టర్, ఇన్‌చార్జి ప్రత్యేకాధికారి ప్రసన్నాంజనేయులు ఇరువురూ మెట్ల వద్దే కూర్చున్నారు. సమస్యలను చెప్పాలని విద్యార్ధులను కోరారు. దీంతో విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను, హాస్టల్ వార్డెన్స్ వ్యవహరిస్తున్న దురుసుప్రవర్తనను వివరించడంతో పాటు లిఖితపూర్వకంగా అందజేశారు. విచారణ సమయంలో కొందరు విద్యార్థులు కన్నీరు పెట్టుకోవడం అధికారులను కదిలించింది. తాము చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు జేసీ హామీ ఇచ్చారు.

నాలుగు గంటల పాటు సాగిన హైడ్రామా...

విద్యార్థులు స్వయంగా జాయింట్ కలెక్టర్‌కు సమస్యలను చెప్పినప్పటికీ వెంటనే చర్యలు ఎందుకు తీసుకోరంటూ డీవైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. వీరికి జతగా టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు శృతి కలపడంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.  ప్రభుత్వాన్ని డీవైఎఫ్‌ఐ నాయకులు తిడుతుండగా టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు అభ్యంతరం చెప్పడంతో వారి మధ్య స్వల్ప వివాదం తలెత్తింది. అనంతరం  పది రోజులుగా విచారణ చేపడుతున్నా చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం అవుతోందంటూ డీవైఎఫ్‌ఐ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి సిబ్బందికి అండగా నిలుస్తున్న అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జేసీ డౌన్‌డౌన్ అంటూ వెంటనే హాస్టల్ వార్డెన్స్‌ను సస్పెండ్ చేసే వరకు ఆందోళన వీడమంటూ భీష్మించుకు కూర్చున్నారు. హాస్టల్ సూపర్‌వైజర్‌లను పిలిపించి విద్యార్థుల సమక్షంలో విచారించాలని కోరారు. దీంతో హాస్టల్ సూపర్‌వైజర్‌లుగా పనిచేస్తున్న వెంకటరెడ్డి, భారతిలను జేసీ పిలిపించి విచారించారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘ నాయకులు బైఠాయించారు. దీంతో బయటకు వెళ్లేందుకు వీలులేకపోవడంతో పాటు మధ్యాహ్నం సమయంలో కావడంతో విద్యార్థులు, అధికారులకు ఆందోళన కారణంగా ఆకలిబాధలు తప్పలేదు. అనంతరం జేసీ జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. విచారణ నివేదికను అందజేసిన వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అయినప్పటికీ విద్యార్థి సంఘాలు పట్టువీడలేదు. వెంటనే సస్పెండ్ చేయాలంటూ బైఠాయించారు.

దీంతో జేసీ చేసేదీమీ లేక కూర్చుండిపోయారు. విద్యార్థులు సైతం అర్ధాకలితోనే ఓవైపు వర్షం కురుస్తున్నా ఆందోళనను కొనసాగించారు. వీరికి తోడుగా కోచ్‌లు, అధ్యాపకులు సైతం జాయింట్ కలెక్టర్‌కు పలు విషయాలు విన్నవించారు. ఎట్టకేలకు 4.30 గంటల సమయంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ హాస్టల్ సూపర్‌వైజర్‌లపై చర్యలు తీసుకోవడానికి నివేదిక సాయంత్రంలోపు అందజేసి చర్యల వివరాలను పత్రికలకు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన వీడారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు విజయ్, భరత్, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు వేణుగోపాల్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement