
నెల్లూరు (మినీబైపాస్): బారాషహీద్ దర్గా రొట్టెల పండగకు ముందే సందడి మొదలైంది. అక్టోబరు 1వ తేదీ పండగ ఆరంభం కానున్న నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తుల రాక గురువారం నుంచే ప్రారంభమైంది. కుల మతాలకు అతీతంగా జరిగే పండగలో అందరూ పాల్గొంటారు. గురువారం భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలను అందుకోవడం, మార్చుకోవడం చేశారు. రొట్టెల పండగకు మూడు రోజుల ముందే భక్తుల రాకతో సందడిగా మారింది. చెరువులో రొట్టెలు మార్చుకుని దర్గా వద్ద సమాధులను దర్శించుకుంటున్నారు.
కోర్కెలు నెరవేరాయి
వైజాగ్ నుంచి పోయిన సంవత్సరం వచ్చి కుమార్తెకు పెళ్లి కావాలని రొట్టెను పట్టుకొన్నాం. పాపకు పెళ్లయింది. తీరిన కోర్కె రొట్టెను వదిలేందుకు వచ్చాము. చాలా సంతోషంగా ఉంద.
– హసన్ వాల్, ఖాదర్ బీ
పిల్లల కోసం రొట్టెలు పట్టుకున్నాం
నంద్యాల నుంచి వచ్చాము. మాకు పిల్లలు లేకపోవడంతో పిల్లల కోసం రొట్టెను పట్టుకోవడానికి ఎంతో నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. పండగ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందుగానే వచ్చేశాం. – కరిముల్లా, ఖమర్
కుమార్తె పెళ్లి కోసం
బెంగళూరు నుంచి ఐదేళ్లుగా వచ్చి రొట్టెను పట్టుకొంటున్నాం. మాకు అనుకొన్నది అనుకొన్నట్టుగా జరిగాయి. ఇప్పుడు కుమార్తె పెళ్లి కోసం వచ్చాము. ఉద్యోగ రీత్యా సెలవు దొరకకపోవడంతో ముందుగానే వచ్చాం. – షబానా
ప్రభుత్వ ఉద్యోగం కోసం
వరంగల్ నుంచి వచ్చాము. మేము రావడం నాల్గో సారి. చదువు రొట్టెను పట్టుకొన్నా..చదువు పూర్తయింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం రొట్టెను పట్టుకొన్నాం. మా అమ్మకు ఆరోగ్యం సరిగా లేదు ఆరోగ్య రొట్టెను కూడా పట్టుకొన్నాం. – అభిజి బీ, పర్వీన్