వుడా జోరు | Soon a huge housing project | Sakshi
Sakshi News home page

వుడా జోరు

Mar 3 2015 12:46 AM | Updated on Sep 2 2017 10:11 PM

వుడా జోరు

వుడా జోరు

కొంతకాలంగా ఉదాసీనంగా ఉన్న వుడా మళ్లీ కార్యాచరణకు ఉపక్రమించింది. ద్విముఖ వ్యూహంతో కార్యరంగంలోకి దిగింది. ఓ వైపు కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన...

త్వరలో భారీ గృహనిర్మాణ ప్రాజెక్టు
శివారులో 300 ఎకరాల్లో నిర్మాణ ప్రణాళిక
అక్రమాల అడ్డుకట్టకు ట్యాంపర్‌ప్రూఫ్ డాక్యుమెంట్లు
కార్యాచరణకు ఉపక్రమించిన వుడా

 
కొంతకాలంగా ఉదాసీనంగా ఉన్న వుడా మళ్లీ కార్యాచరణకు ఉపక్రమించింది. ద్విముఖ వ్యూహంతో కార్యరంగంలోకి దిగింది. ఓ వైపు కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన... మరోవైపు వుడాలో సంస్కరణలకు తెరతీసింది. వుడా వీసీ బాబూరావునాయుడు ఈ కొత్త కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నారు.
 
విశాఖపట్నం: విశాఖ శివారులో ఓ భారీ గృహనిర్మాణ ప్రాజెక్టుకు వుడా ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేస్తోంది. రో హౌసింగ్‌ను లీజుకు ఇచ్చేందుకు సంసిద్ధమవుతోంది. మరోవైపు ఆదాయ మార్గాల పెంపుపై దృష్టి సారించింది. భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్ల జారీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. వుడా వేగవంతం చేసిన కార్యాచరణ ప్రణాళిక ఇలా ఉంది...

భారీ గృహనిర్మాణ ప్రాజెక్టుకు రూపకల్పన

కొంతకాలంగా వుడా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు. కొన్నేళ్లుగా వివాదాలు, కుంభకోణాలతో కొత్త ప్రాజెక్టులకు దూరంగా ఉంటూ వస్తోంది. కాగా రాష్ట్ర విభజన అనంతర నేపథ్యంలో ఓ భారీ గృహనిర్మాణ ప్రాజెక్టు చేపట్టాలని వుడా నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం రాష్ట్ర అవసరాల కోసం అటవీభూములను డీనోటిఫై చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా విశాఖ శివారులో డీనోటిఫై చేయనున్న భూముల్లో ఈ భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టు చేపట్టాలన్నది వుడా ఉద్దేశం. శివారులోని దాదాపు 300 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇంకా ప్రాథమిక దశలోనే ఈ ప్రాజెక్టు విధివిధానాల గురించి వైస్ చైర్మన్ బాబూరావునాయుడు ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది.

ట్యాంపర్‌ప్రూఫ్ డాక్యుమెంట్లు: భూ అక్రమాలకు రికార్డులు ఫోర్టరీ చేయడమేనని వుడా గుర్తించింది. ప్రధానంగా వుడా అనుమతులను ఇష్టానుసారంగా ట్యాంపర్ చేస్తూ భూ, రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. అనుమతి ఇచ్చినదానికంటే ఎక్కువ విస్తీర్ణంలో లే అవుట్లు వేయడం, ఒకే అనుమతితో వేర్వేరు లే అవుటు వేయడం...ఇలా వివిధ రకాలుగా యథేచ్ఛగా అక్రమాలకు తెగిస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు వుడా అనుమతులన్నీ త్వరలో ట్యాంపర్‌ఫ్రూఫ్ డాక్యుమెంట్లుగా జారీ చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక హోలోగ్రామ్‌తో ఈ డాక్యుమెంట్లను ఏమాత్రం ఫోర్జరీ చేయడంగానీ ఇతరత్రా అవకతవకలకుగానీ అవకాశం ఉండదు. వైస్ చైర్మన్ బాబూరావు నాయుడు గతంలో పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇసుక తవ్వకాల అనుమతి పత్రాలను ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అదే తరహాలో వుడా అనుమతిపత్రాలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు.
 
రో హౌసింగ్ లీజుకు..

 
రోహౌసింగ్‌లో మిగిలిపోయిన ప్లాట్లను లీజుకు ఇవ్వాలని వుడా నిర్ణయించింది. రో హౌసింగ్‌లో 88 యూనిట్లకు గతంలోనే 30 యూనిట్లు వేలంలో విక్రయించేశారు. ఇటీవల మిగిలిన యూనిట్లకు ఇటీవల వేలం నిర్వహించినప్పటికీ కేవలం మూడే అమ్ముడయ్యాయి. దాంతో ఆదాయాన్ని పెంచుకునేందుకుగాను ఆ యూనిట్లను లీజుకు ఇవ్వాలని వుడా నిర్ణయించింది. బ్యాంకులు, పర్యాటక, ఐటీ, ఇతర కార్పొరేట్ సంస్థలకు ఈ యూనిట్లను లీజుకు ఇవ్వాలన్నది వుడా ఉద్దేశం. తద్వారా మెరుగైన ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ఇలా కొత్త ప్రాజెక్టులతోపాటు సంస్కరణలతో వుడా కార్యాచరణను వేగవంతం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement