దేశానికి పంగనామాలు పెట్టొద్దు

దేశానికి పంగనామాలు పెట్టొద్దు


తానా రెండో రోజు మహా సభల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు

తెలుగు లిపి అజంతా శిల్పమంతటి అందమైనదన్న జస్టిస్ ఎన్వీ రమణ


 

డెట్రాయిట్: అమెరికా తెలుగు అసోసియేషన్(తానా) మహాసభలు రెండోరోజు ఘనంగా జరిగాయి. ఈ సభలకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. మతం ఏదైనా, కులం ఏదైనా జనాలందరూ తమకు కావల్సినట్లు అడ్డనామమో, నిలువునామమో పెట్టుకోండిగానీ దేశానికి మాత్రం పంగనామాలు పెట్టొద్దని అన్నారు. భారతీయ విధానాల్లో సైన్స్ నిగూఢంగా దాగుందన్నారు. ధ్యానం దేవుడితో మాట్లాడే వైర్‌లెస్ టెక్నాలజీ అని చెప్పారు. జస్టిస్ నూతలపాటి వెంకటరమణ మాట్లాడుతూ 36.5 కోట్ల మంది యువతతో భారత్ నవయవ్వనంతో తొణికిసలాడుతోందని అన్నారు.తెలుగు లిపి అజంతా శిల్పమంతటి అందమైనదని, జపాన్, చైనా దేశాలు భాషనే ఆయుధంగా మలుచుకుని ప్రపంచ వాణి జ్యాన్ని శాసిస్తున్నాయని అందుకే అందరూ భాషను గుర్తించి గౌరవించాలని కోరారు. అనంతరం వెంకయ్య నాయుడు వేడుకల సావనీర్‌ను విడుదల చేశారు. చిత్తూరు ప్రవాసులు న్యూట్రిన్ సంస్థల ఉపాధ్యక్షురాలు అనితారెడ్డికి ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. ఈ సభల సమన్వయకర్త నాదెళ్ల గంగాధర్ ఆధ్వర్యంలో రాజకీయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు రైతులకు పింఛను పథకాన్ని అమలు చేయాలని సభల్లో ఏకగ్రీవ తీర్మానం చేశారు.అందరూ తనను మౌనముని అంటారని కానీ తనను తాను మహామౌనమునిగా పిలుచుకుంటానని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సభలో చమత్కరించారు. రెండోరోజు జరిగిన పలు కార్యక్రమాల్లో నిర్మాత సురేశ్‌బాబు, ఏపీ స్పీకర్ కోడెల, మేరీల్యాండ్ ప్రతినిధుల సభ సభ్యురాలు కాట్రగడ్డ అరుణ మిల్లర్ , ఎంపీ సీఎం రమేశ్, ఏపీ మంత్రులు అయ్యనపాత్రుడు, కామినేని, పరిటాల, క్యూబాలో భారత రాయబారి రవి, పితాని, ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ , టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, సినీనటుడు వెంకటేశ్, నటులు నారా రోహిత్, హరినాథ్ పొలిచెర్ల తదితరులు పాల్గొన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top