పాఠ్యపుస్తకాల్లోనూ మార్పులు! | School Books has to be changed bifurcation of state | Sakshi
Sakshi News home page

పాఠ్యపుస్తకాల్లోనూ మార్పులు!

Aug 8 2013 2:52 AM | Updated on Sep 15 2018 5:32 PM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం నేపథ్యయంలో పాఠశాల విద్యాశాఖలో పరిస్థితిపై చర్చలు ఊపందుకున్నాయి. విద్యాశాఖ, దాని కార్యకలాపాలు ఎలా ఉండనున్నాయన్న విషయంలో వివిధ కోణాల్లో విశ్లేషణలు చేస్తున్నారు.

 తెలంగాణ రాష్ట్రం నేపథ్యంలో మారనున్న ముఖచిత్రం
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం నేపథ్యయంలో పాఠశాల విద్యాశాఖలో పరిస్థితిపై చర్చలు ఊపందుకున్నాయి. విద్యాశాఖ, దాని కార్యకలాపాలు ఎలా ఉండనున్నాయన్న విషయంలో వివిధ కోణాల్లో విశ్లేషణలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే పాఠశాల విద్యా శాఖ ముఖచిత్రమే మారిపోతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పాఠ్య పుస్తకాల్లో అనేక మార్పులు వస్తాయని భావిస్తున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడితే స్థానిక సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేవి పాఠ్య పుస్తకాలే. కాబట్టి ముఖ్యంగా తెలుగు, సాంఘిక శాస్త్రం వంటి పుస్తకాల్లోని పాఠ్యాంశాల్లో ఎక్కువ మార్పులు చేయాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. పాలకుల అభీష్టం మేరకు కొత్త రాష్ట్రంలో అనుసరించాల్సిన విద్యా విధానాలు, విద్యా సంస్థల ఏర్పాటు తదితర అంశాలపై అధ్యయనం చేసి, ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాల్సి వస్తుందని చెబుతున్నారు.
 
 మారనున్న రాష్ట్ర గేయం?
 తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యాశాఖ పరంగా ముందుగా రెండు వేర్వేరు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అంతేకాదు ఉమ్మడి రాజధానిలో ప్రత్యేక డెరైక్టరేట్‌లను కూడా ఏర్పాటు చేసుకోవాలి. అవి ముందుగా పాఠ్య పుస్తకాల్లో మార్పులపైనే ప్రధానంగా దృష్టి సారిస్తాయి. రెండు రాష్ట్రాల్లోనూ కొత్తగా ఏర్పాటయ్యే ఆయా సంస్థలు ఆయా రాష్ట్రాల్లోని స్థానిక, సామాజిక, ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేసుకుంటారు.
 
 మరోవైపు తెలుగు ప్రజలంతా ప్రస్తుతం ఆలపిస్తున్న రాష్ట్ర గేయం ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ..’ గేయాన్నే రెండు రాష్ట్రాల్లో ఆలపిస్తారా? లేదా మార్చుకుంటారా? అనే చర్చ ప్రధానంగా సాగుతోంది. తెలంగాణ ఉద్యోగులు మాత్రం రాష్ట్ర గేయాన్ని మార్చక తప్పదని అంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందే తెలంగాణ ఉద్యోగులు ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయ కేతనం...’ గేయాన్ని రూపొందించుకున్నారు. దీంతోపాటు మరో రెండు గేయాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.
 
 సాంఘిక, తెలుగు పుస్తకాల్లోనే చాలా మార్పులు
 జాతీయ స్థాయి పోటీ పరీక్షల నేపథ్యంలో ప్రధాన సబ్జెక్టులైన సామాన్యశాస్త్రం, గణిత శాస్త్రం పుస్తకాల్లో పెద్దగా మార్పులు ఉండవు. ఇంగ్లిష్ విదేశీ భాష, హిందీ జాతీయ భాష కావడంతో ఆ పుస్తకాల్లోనూ పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం రాదు. అయితే భాషా, సంస్కృతీ సంప్రదాయాలు, కళలు, కళాకారులు, సాంఘిక, రాజకీయ, భౌగోళిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే రెండు రాష్ట్రాల్లోనూ స్థానిక పరిస్థితులకు పెద ్దపీట వేసి తెలుగు, సాంఘిక శాస్త్రం పుస్తకాల్లో మార్పులు చేయాల్సి వస్తుంది.
 
 ఒకటి నుంచి 10వ తరగతి వరకున్న పుస్తకాల్లో స్థాయిని బట్టి మార్పులు ఉండొచ్చు. వీటిల్లోనూ జాతీయ, అంతర్జాతీయ పాఠ్యాం శాల్లో పెద్దగా మార్పులు ఉండవు. రాష్ట్ర విభజనతో సరిహద్దులు మారుతాయి. దీంతో ఆయా రాష్ట్రాల సరిహద్దులు, భౌగోళిక అంశాలు, సహజ వనరులు వంటి అంశాలతో ప్రత్యేకంగా పాఠ్యాంశాలు ఉంటాయి. సాంఘిక శాస్త్రంలో ఆయా రాష్ట్రాల కొత్త చిత్రాలు ముద్రించాల్సిందే. అలాగే ప్రత్యేక రాష్ట్ర విభజనపైన పాఠ్యాంశాలు చేర్చే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement