బాటసారులకు ‘సాక్షి’ బాసట 

Sakshi News Paper Food Distributed To Migrant Workers In Srikakulam District

ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌

సహకారంతో వలస కార్మికులకు చేయూత 

భోజన సదుపాయం.. ఇచ్ఛాపురం వరకు బస్సుల ఏర్పాటు 

సాక్షి,  రణస్థలం: కరోనా రక్కసి కాటుకు మహానగరాలు మూగబోయాయి. వలస కార్మికుల కష్టాలు తీర్చే కరుణ గల మనుషులు కరువయ్యారు. అక్కడ ఒక్క పూట అన్నం పెట్టే నాథుడే కానరాలేదు. సొంతూరు వెళ్లేందుకు రవాణా సాధనాలు లేకపోయె.. అయినా ప్రాణాలు నిలవాలంటే వెళ్లకతప్పదని నడకబాట పట్టారు. రోజుల తరబడి నడుస్తున్న ఈ బాటసారులకు ‘సాక్షి’ అండగా నిలిచింది. ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ దృష్టికి వలస కార్మికుల దీనగాథలను తీసుకువెళ్లింది. దీంతో ఆయన వారందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. జిల్లా ముఖద్వారమైన పైడిభీమవరం నుంచి రాష్ట్ర సరిహద్దు ఇచ్ఛాపురం వరకు తీసుకువెళ్లేందుకు వారికి వాహనాలు సమకూర్చారు. బాటసారుల బాధలు తీర్చేందుకు బాసటగా నిలిచారు.

వలస కార్మికులకు భోజనం ప్యాకెట్లు అందిస్తున్న ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌  

పైడిభీమవరం చెక్‌పోస్టు  వద్దకు నడుచుకుంటూ వచ్చిన వలస కార్మికులకు ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ అండగా నిలిచారు. వారి బాధలను ‘సాక్షి’ దినపత్రిక తన దృష్టికి తేవడంతో ఆయన వెంటనే స్పందించారు. అరబిందో పరిశ్రమ, వెంకటేశ్వర విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యాసంస్థల సహకారంతో ఆదివారం 7 బస్సులు సమకూర్చారు. బస్సు ఎక్కే ముందు శానిటైజర్‌తో కార్మికుల చేతులను శుభ్రం చేయించారు. అనంతరం బస్సుల్లో ఇచ్ఛాపురం వరకు వలస కార్మికులను తరలించారు. వారికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇలా మరో వారం రోజులపాటు రోజు వలస కారి్మకులకు అవసరమైన బస్సులు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

తొలి రోజు ఒడిశా, బీహర్, పశ్చిమ బెంగ రాష్ట్రాలతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన వలస కారి్మకులకు బస్సులు ఏర్పాటు చేశారు. రామతీర్ధాలు కూడలి వద్ద వారికి భోజనం ప్యాకెట్లు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ వలస కార్మికుల కష్టాలు చూసి ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడే భోజన సదుపాయాలు చేస్తుందని, రాష్ట్ర సరిహద్దు వరకు బస్సుల్లో తరలిస్తోందని తెలిపారు. ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటించి, శుచిగా, శుభ్రంగా ఉండాలని, అనారోగ్య సమస్యలుంటే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జె.ఆర్‌.పురం సీఐ హెచ్‌.మల్లేశ్వరరావు, ఎస్సై శ్రీనివాస్, అరబిందో జీఎం ఎన్‌.రాజారెడ్డి, డీజీఎం వెంకటరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు లంకలపల్లి ప్రసాద్, ఆకుల శ్రీనివాసరావు, నారయప్పారావు, అల్లంపల్లి బాషా తదితరులు పాల్గొన్నారు.

బస్సు ఎక్కేముందు వలస కార్మికులు చేతులు శుభ్రం చేసు కునేందుకు శానిటైజర్‌ ఇస్తున్న ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌  

ఏపీ ప్రభుత్వం ఆదుకుంది  
చెన్నైలో నాలుగు రోజుల క్రితం నడుచుకుంటూ బయలుదేరాం. కొంతదూరం వచ్చేసరికి ఏపీ ప్రభుత్వ పోలీసులు బస్సు ఎక్కించి కొంతవరకు సాగనంపారు. తరువాత కొంత నడిచాం. మరోచోట అక్కడ పోలీసులు లారీ ఎక్కించారు. మళ్లీ ఇక్కడ బస్సులో పంపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం బాగా చూసుకుంటోంది. 
–బిలాందాస్, పశ్చిమ బెంగ 

నేను చనిపోతే నా పిల్లలకు దిక్కెవరు? 
చెన్నైలో ఇనుపరాడ్ల బెండింగ్‌ పనికి మా ముఠావాళ్లతో ఐదు నెలల క్రితం వెళ్లాను. నేను కష్టపడి డబ్బు పంపిస్తేనే ఇల్లు గడుస్తుంది. మొదటి రోజు నడిచినడిచి అలిసిపోయి పడిపోయాను. నేను ఇక్కడే చనిపోతే నా పిల్లలకు దిక్కెవరని అల్లాకు నమాజ్‌ చేసుకున్నాను. ఏపీలోకి వచ్చాక బస్సులు, లారీలు దొరుకుతున్నాయి.  
– అబ్బాస్‌ అసాన్, పశ్చి బెంగ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top