ఎస్కేయూకు భ'రూసా'

Rusa Scheme Heavily Funded For Provision Of Infrastructure In Higher Education Institutions - Sakshi

రూసా నిధులకు 2020 ఆగస్టు వరకు గడువు 

రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి ఆమోదం 

రూ.15కోట్ల నిధుల వినియోగానికి మార్గం సుగమం 

గతంలో నిధులను మళ్లించిన టీడీపీ సర్కారు 

సకాలంలో ఖర్చు చేయక వెనక్కు పంపాలని ఆదేశం 

తాజా ప్రభుత్వ చొరవతో తొలగిన గ్రహణం 

గత ఎన్నికల్లో గెలవడమే పరమావధిగా భావించిన చంద్రబాబు అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు. ప్రచారం హోరెత్తించేందుకు నిధులన్నీ ఇష్టానుసారం మళ్లించారు. చివరకు ఎస్కేయూలో సౌకర్యాల కల్పన, కోర్సుల బలోపేతానికి ‘రూసా’ పథకం కింద కేంద్రం ఇచ్చే నిధులనూ వర్సిటీకి పంపకుండా దారిమళ్లించారు. ఖర్చు చేసిన వాటికి లెక్కలు చెప్పాలని ‘రూసా’ అధికారులు కోరగా.. ఖర్చే చేయలేదంటూ మాటమార్చారు. దీంతో సకాలంలో వినియోగించని రూ.15 కోట్లు వెనక్కుపంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేయగా.. ప్రస్తుత సర్కారు గడువు పెంచేలా ‘రూసా’ అధికారులతో చర్చలు జరిపి సఫలమైంది. దీంతో రూసా పథకం అమలుకు ఏర్పడిన గ్రహణం తొలగింది.  – ఎస్కేయూ 

ఉన్నత విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, సౌకర్యాలు, కోర్సులను బలోపేతం చేయడానికి తగిన వనరుల సమీకరణకు రాష్ట్రీయ ఉచ్ఛతార్‌ శిక్షా అభియాన్‌(రూసా) పథకం భారీ స్థాయిలో నిధులను మంజూరు చేస్తోంది. న్యాక్‌(నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌  అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌) ఏ–గ్రేడ్‌ గుర్తింపు ఉన్న వర్సిటీకి రూ.100 కోట్లు, బీ–గ్రేడ్‌ గుర్తింపు ఉన్న వర్సిటీకి రూ.20 కోట్లు చొప్పున మంజూరు చేస్తోంది. ఈ నేపథ్యంలో న్యాక్‌ బీ–గ్రేడ్‌ దక్కించుకున్న ఎస్కేయూకు రూ.20 కోట్ల నిధులు మంజూరుకు మార్గం ఏర్పడింది. తొలి విడతలో 2016 ఫిబ్రవరి నాటికే రూ.10 కోట్ల నిధులను కేంద్రం రూసా రాష్ట్ర ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌కు పంపగా.. ఆ నిధులను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇతర పథకాలకు వినియోగించింది. అనంతరం మరో రూ.5 కోట్లు విడుదల చేయగా వాటిని కూడా ఇతర పథకాలకు మళ్లించారు. అయితే ఖర్చు చేసిన నిధులకు యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు(యూసీ) పంపాలని గత ప్రభుత్వానికి రూసా అధికారులు లేఖరాశారు. దీంతో 2018 జూలైలో హడావుడిగా వినియోగించిన నిధులను రూ.15 కోట్లను ఎస్కేయూ ఖాతాకు పంపించారు. ఈ క్రమంలో నాలుగు నెలల వ్యవధిలో ఆ నిధులను ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొనగా.. సకాలంలో ఖర్చు చేయని నిధులను వెనక్కి పంపాలని రూసా పథకం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.  

తాజా సర్కార్‌ విన్నపంతో గడువు పెంపు 
రూసా పథకం నిధులు ఒక్కసారి వెనక్కి పంపితే...తిరిగి ఏటా అందవు. కరువు జిల్లాలోని వర్సిటీకి నిధుల లభ్యతకు ఇబ్బంది ఏర్పడుతుంది. దీన్ని గుర్తించిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం, ఎస్కేయూ ఉన్నతాధికారులతో మాట్లాడి గతంలో జరిగిన తప్పిదాన్ని ‘రూసా’ ఉన్నతాధికారులకు వివరించింది. కాస్త సమయం ఇవ్వాలని కోరింది. దీంతో అక్కడి అధికారులు 2020 ఆగస్టులోపు రూ.15 కోట్ల నిధులను వినియోగించి యూసీలు పంపితే .. మరో రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేస్తామని ఎస్కేయూ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నిధులన్నీ ఖర్చు చేసి వసతులు, కోర్సుల బలోపేతానికి చర్యలు తీసుకుంటే వర్సిటీకి న్యాక్‌–ఏ గ్రేడ్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే  మరో రూ.100 కోట్ల నిధులు మంజూరు కానున్నాయి.  

వెసులుబాటు కల్పించారు 
వాస్తవానికి ఆగస్టు 2018లోపు ‘రూసా’ పథకం నిధులను పూర్తిగా ఖర్చు చేయాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఖాతా నుంచి ఎస్కేయూ ఖాతాకు నిధులు జమ కావడంలో జాప్యం జరిగింది. ఈ అంశాన్ని కేంద్ర రూసా పథకం అధికారులకు స్పష్టంగా వివరించారు. దీంతో నిధుల వినియోగానికి సంబంధించి వెసులుబాటు కల్పించారు. 2020 ఆగస్టులోపు నిధులను వినియోగించి యూసీలు పంపాలని సూచించారు. 
ప్రొఫెసర్‌ ఎండీ బావయ్య, రూసా పథకం కోఆర్డినేటర్, ఎస్కేయూ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top