మినీవ్యాన్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ

మినీవ్యాన్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ


భీమడోలు :గుండుగొలను సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ఐసర్ వ్యాన్‌ను వెనుక నుంచి ఆర్టీసీ బస్ ఢీకొన్న ఘటనలో బస్ డ్రైవర్ దుర్మరణం చెందగా, బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్ నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ మంగళవారం రాత్రి అమలాపురం బయలుదేరింది. మార్గమధ్యంలో గుండుగొలను సమీపంలోకి వచ్చేసరికి పిడుగురాళ్ల నుంచి రాజమండ్రికి పచ్చిమిరపకాయల లోడుతో వెళుతూ టైర్ పంక్చర్‌కావడంతో రోడ్డుపై నిలిచి ఉన్న ఐసర్ వ్యాన్‌ను వెనుక నుంచి వేగంగా వస్తూ ఆర్టీసీ బస్ ఢీకొంది.

 

 దీంతో బస్సును నడుపుతున్న డ్రైవర్ శ్రీకాకుళం జిల్లా చిగడాం మండలం రౌతు గ్రామానికి చెందిన దండు రమేష్‌రాజు (32) అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా బస్సులో ప్రయాణృకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్ధరిల్లింది. స్థానికులు కొందరు స్పందించి 108కు సమాచారం అందించి క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ ఎన్.దుర్గాప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. హైవే అధారిటీకి చెందిన వాహనంతో బస్సును పక్కకు జరిపారు. గుండుగొలను వీఆర్వో పి.పోతురాజు పంచనామా నిర్వహించారు.  డ్రైవర్ మృతదేహాన్ని ఏలూరు తరలించి ఎస్సై బిృసురేందర్‌కుమార్ కేసు నమోదు చేశారు.

 

 క్షతగాత్రులకు ఏలూరులో చికిత్స

 ఏలూరు (వన్‌టౌన్) : ప్రమాదంలో గాయాలపాలైన వారిలో ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారే ఉన్నారు. అమలాపురం, ముమ్మిడివరానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్లు వలవల సత్యనారాయణ మూర్తి, కొప్పిశెట్టి సత్యనాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరానికి చెందిన ఎల్లమిల్లి ప్రియాంక, హైదరాబాద్‌కు చెందిన కొండేటి శ్యామల, కర్రి వీరభధ్రలక్ష్మీనారాయణ, విజయనగరం ఆలమందకు చెందిన కొచ్చెర్లపాటి రాజేష్ (వ్యాన్ క్లీనర్), పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు వీరమళ్ల బాలచంద్రుడు గాయాలతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top