హైవే.. మృత్యుకేక

Road Accidents in Srikakulam District - Sakshi

చురుగ్గా ఆరు లైన్ల విస్తరణ పనులు  

జిల్లాలో పెరుగుతున్నరోడ్డు ప్రమాదాలు  

రాత్రి ఘటనలే ఎక్కువ

వాహనదారులకు కొరవడిన అవగాహన

ఇటీవల కారు ప్రమాద బాధితులు అధికం

జిల్లా జాతీయ రహదారి నెత్తురోడుతోంది. సుదీర్ఘ పొడవున్న ఈ రహదారిపై నిత్యం ఏదో ఒక చోట మృత్యుకేక వినిపిస్తోంది. వాహనాల రద్దీని తట్టుకునేందుకు వీలుగా ఏడాదికిపైగా నాలుగు లైన్ల రోడ్డును ఆరులైన్లుగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది. ప్రధానంగా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు దారిని అంచనా వేయలేక మృత్యువాత పడుతున్నారు. ఇందులో ఎక్కువగా కార్లలో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలే గాలిలో కలిసిపోతున్నాయి. ఇవి కూడా రాత్రిళ్లు చోటు చేసుకోవడం గమనార్హం.  

శ్రీకాకుళం, కాశీబుగ్గ: జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న రోడ్ల ప్రమాదాలు కలవరం కలిగిస్తున్నాయి. నిద్రమత్తులో కొందరైతే, బయటపడని కారణాలతో మరికొందరు ఏమరుపాటుగా ప్రమాదాలకు గురై మృత్యవాత పడుతున్నారు. కొద్ది నెలల వ్యవధిలో పలు సంఘటనలకు జిల్లా కేంద్ర బిందువుతోంది. అటువంటి ప్రమాదాలకు గల కారణాలు, ఇతర జాగ్రత్తలు పోలీసుల చర్యలతో సాక్షి ప్రత్యేక కథనం..
జిల్లా వ్యాప్తంగా ఎన్‌హెచ్‌ 16 విస్తరణపనులు... 

విశాఖపట్నం నుంచి మన జిల్లా వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. నరసన్నపేట వరకు ఆరు లైన్ల రోడ్డు విస్తరణ, అక్కడ నుంచి ఇచ్ఛాపురం వరకు ముందస్తుగా వంతెనలు, ప్లైఓవర్ల నిర్మాణాలు వేగవంతమయ్యాయి. ఈ తరుణంలో అధికంగా రాత్రిళ్లు పనులు చేస్తుండటం, పూర్తిస్థాయి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, అప్పటి వరకు అదే రోడ్డులో రాకపోకలు కల్పించి, అకస్మాత్తుగా రాత్రి పదకొండు గంటల తర్వాత దారి మళ్లింపు వంటి చర్యలు ప్రమాదకరంగా మారుతున్నాయి. రోడ్డు విస్తరణ మంచిదైనప్పటికి అటుగా ప్రయాణించే ప్రయాణికులకు ప్రాణాపాయంగా మారుతోంది. ఈ పనులు గమనించక సొంపేట మండలం వద్ద ప్రమాదంలో ఇద్దరు జవాన్లు బోల్తాపడగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.

టోల్‌గేటు వద్ద సిబ్బంది నిర్లక్ష్యం
జిల్లాలో చిలకపాలెం, మడపాం, ఇచ్ఛాపురం టోల్‌గేట్ల వద్ద సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కారులో వచ్చిన వారికి రాత్రిళ్లు నిలిపివేసి ఫేస్‌వాష్‌ చేయించడం, డ్రైవర్‌ ఇతర ప్రయాణికుల కళ్లలో నిద్ర రాకుండా డ్రాప్స్‌ వేయించడం వంటి నిబంధనలు ఉన్నప్పటికీ, ఒకట్రెండు రోజులు మాత్రమే అమలు చేసి వదిలేశారు. 

ప్రమాదానికి ప్రధాన కారణాలు...
వ్యక్తిగత పనులపై ఎక్కువగా సుదూర ప్రాంతాలకు కారులో వెళ్లి వస్తున్నారు. వివిధ బాధ్యతల దృష్ట్యా నిద్రలేనప్పటికీ వారే డ్రైవింగ్‌ చేయడం, 500 కిలోమీటర్ల తర్వాత కనీసం విశ్రాంతి తీసుకోకుండా ఉదయానికి చేరుకోవాలనే ఆతృతతో అనుకోని ప్రమాదాలకు గురవుతున్నారు.
అధికంగా ప్రమాదాలు.. రాత్రిళ్లు ప్రయాణించడం, నిద్రమత్తు ఆవరించడం, మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడం, కొత్త ప్రాంతానికి వెళ్తున్నప్పుడు దారి అంచనా వేయలేక, వంటి కారణాలు.
ఒక కారును చూసి మరో కారు పోటీపడి ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ముందు వాహనాలను ఢీకొనడం, దాబాల వద్ద మద్యం సేవించడం, వివాహాలు, విందు వినోదాలకు హాజరై మద్యం మత్తులో కార్లలో ప్రయాణించి ప్రమాదాలకు గురవుతున్నారు.

ఇటీవల కారు ప్రమాదాలు...  
జనవరి 4న పలాస నియోజకవర్గం మందస మండలం కొత్తపల్లి గ్రామానికి సమీపంలో జాతీయ రహదారిపై వేకువజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సింహాచలం నుంచి బరంపురం వెళ్తుండగా పలాసలో టీ తాగి వెళ్తుండగా నిద్దమత్తులో రోడ్డు పక్కన కల్వర్టులోకి దూసుకుపోవడంతో రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు ప్రాణాలు విడిచారు.
జనవరి 6న పలాస మండలం రంగోయి జాతీయ రహదారిపై నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు అతివేగంతో వెళ్లి డివైడర్‌కు తగిలి కారు బోల్తా పడింది. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.  
ఇటీవల ఐదు రోజుల క్రితం వంశధార కాలువలో కారు పడిపోయిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మృత్యవాత పడ్డారు. వీరు ఒడిశా నుంచి అర్ధరాత్రి వేళ వస్తుండగా మలుపును గుర్తించకపోవడంతో కారు కాలువలోకి దూసుకుపోయింది

అధికంగా మలుపు రోడ్లు...  
సువిశాలమైన జాతీయ రహదారిలో శ్రీకాకుళం దాటి పలాస వచ్చినప్పటికీ 80 కిలోమీటర్లు పడుతుంది. ఆ తర్వాత అధికంగా మలుపుల రోడ్లు ప్రారంభం కావడంతో ప్రమాదాలకు కారణంగా భావిస్తున్నాం. హైవే పెట్రోలింగ్, టోల్‌గేటు వద్ద ఫేస్‌వాస్, డ్రాప్స్‌ వేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల ఎస్పీ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ కారు యజమానులకు, డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నాం.      –ఎన్‌ శివరామరెడ్డి, పోలీసు డివిజన్‌ అధికారి, కాశీబుగ్గ  

విస్తరణ పనులు పూర్తయితే..  
లక్ష్మీపురం జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద కారు ప్రయాణికులకు ఫేస్‌వాస్‌ చేయిస్తున్నాం. కళ్ల మంటలు, ఇతర సమస్యలు ఉంటే డ్రాప్స్‌ వేస్తున్నాం. ప్రమాదాల రీత్యా హరిపురం వద్ద విశ్రాంతి తీసుకోవడానికి చక్కనైన భవనాలు కట్టిస్తున్నారు. దీంతోపాటు 24 గంటల ప్రథమ చికిత్స పాయింట్‌ ఏర్పాటు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి.– శ్రీనివాసరావు, మేనేజర్‌ జాతీయ రహదారి టోల్‌ప్లాజా, లక్ష్మీపురం, పలాస

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top