మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించడం ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి మాలతి అన్నారు.
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించడం ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి మాలతి అన్నారు. మహిళా భద్రతా పక్షోత్సవాల సందర్భంగా బుధవారం టీటీడీసీలో డీఆర్‌డీఏ జెండర్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
దేశంలో మహిళల భద్రత కోసం అనేక చట్టాలు ఉన్నప్పటికీ అవి సక్రమంగా అమలుకావడం లేదని పేర్కొన్నారు. బాల్య వివాహాలు, అత్యాచారాలు, గృహ హింస తదితర సమస్యలను చొరవ తీసుకొని నిరోధించాల్సిన అవసరముందన్నారు. మహిళా సమస్యలను వెలికితీయడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు. సమావేశానికి అధ్యక్షత వహించిన డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ మహిళలు సమష్టిగా తమ సమస్యలను ఎదుర్కోవాలని చెప్పారు. భ్రూణహత్యలపై తమకు సమాచారం అందించాలన్నారు.
మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ సుధాకర్ మాట్లాడుతూ మహిళలపై హింస శోచనీయమన్నారు. విలువలతో కూడిన భావితరాలను అందించడం ద్వారానే నేరాలు తగ్గుముఖం పట్టగలవన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ లీలావతి మాట్లాడుతూ గర్భస్థ దశ నుంచి వృద్ధాప్యం వరకు మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆమె వివరించారు. కలసపాడు మండలంలో భ్రూణ హత్యలు అధికంగా ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి అపూర్వ సుందరి, స్టెప్ సీఈఓ మమత, డీఆర్‌డీఏ ఏపీడీలు సుందర్‌రాజు, నాగరాజు, జిల్లా శిశు రక్షణ అధికారి శివప్రసాద్‌రెడ్డి, జెండర్ డీపీఎం వసుంధర పాల్గొన్నారు.