ఆ 26 కోట్లు తీసుకోలేం

RBI refuses to accept TTD's 26 cr demonetised notes - Sakshi

పాత నోట్లపై మరోసారి టీటీడీకి స్పష్టం చేసిన ఆర్‌బీఐ

సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ ఖజానాలో ఉన్న రూ. 26 కోట్ల విలువైన పాత రూ.500, 1000 కరెన్సీ నోట్లను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోలేమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారులు టీటీడీ అధికారులకు మరోసారి తేల్చి చెప్పారు. ఒకవేళ తీసుకున్నా ఆయా నోట్లకు సమాన విలువ గల నగదు తిరిగి టీటీడీ ఖాతాకు జమ కాదనీ స్పష్టం చేశారు. తిరుపతి పద్మావతీ అతిథి గృహంలో గురువారం మధ్యాహ్నం జిల్లా బ్యాంకర్లతో ఆర్‌బీఐ అధికారులు ప్రత్యేకంగా సమావేశమై బ్యాంకులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా టీటీడీ నుంచి సమావేశానికి హాజరైన పరకామణి డిప్యూటీ ఈవో రాజేంద్రుడు, సీవీఎస్‌వో ఆకే రవికృష్ణలు రద్దయిన నోట్ల నిల్వల గురించి ప్రస్తావించారు. దీంతో సమావేశానికి హాజరైన ఆర్‌బీఐ డీజీఎం నాగేశ్వరరావు పై విధంగా సమాధానమిచ్చారు. నిబంధనల ప్రకారం రద్దయిన నోట్లను తీసుకోవడం కుదరదనీ, సొంత ఖర్చులతో కరెన్సీ తెచ్చి ఆర్‌బీఐకి అప్పగించడం మంచిదన్న రీతిలో ఆయన టీటీడీకి సలహా ఇచ్చారు.

కేంద్రం జోక్యం చేసుకుంటేనే...
ఈ నేపథ్యంలో నిల్వ ఉన్న రూ.26 కోట్ల కరెన్సీని చట్టబద్ధంగా మార్చుకునే అంశంపై టీటీడీ దృష్టి పెడుతోంది. నోట్ల మార్పిడికి ఆర్‌బీఐ 2016 డిసెంబరు 31వ తేదీని ఆఖరు తేదీగా నిర్దేశించింది. అయితే ఆ తేదీ తరువాత భక్తులు శ్రీవారి హుండీలో వేసిన నోట్లను లెక్కిస్తే రూ.26 కోట్లుగా తేలింది. స్వామివారి సొమ్ము కావడంతో కేంద్రం ప్రత్యేక కేటగిరీ కింద అంగీకరించే వీలుందని టీటీడీ అభిప్రాయపడుతుంది. ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ కూడా కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top