నల్లబజారుకు రేషన్‌బియ్యం

Ration Rice Going to Black Market - Sakshi

బియ్యం అక్రమాలపై జేఏసీ ఏర్పాటు అయినా ఆగని వైనం

డీలర్లంతా అధికారపార్టీ  కావడంతో చర్యలకు వెనకడుగు

ప్రతినెలా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతున్న వేల క్వింటాళ్లు

రేషన్‌బియ్యం మాఫియా పెచ్చరిల్లుతోంది. అందినంత చౌకబియ్యాన్ని రూటు మార్చి, బియ్యం రూపు మార్చి నల్లబజారుకు తరలించి సొమ్ముచేసుకుంటోంది. అధికార పార్టీ నేతల అండదండలతో అధికారుల హెచ్చరికలను పెడచెవినపెట్టి తమ దందా కొనసాగిస్తోంది.

నరసరావుపేటటౌన్‌: అధికారులు ఓవైపు హెచ్చరిస్తున్నా రేషన్‌ మాఫియా ఆగడాలను ఆపడం లేదు. పేదలకు పంచాల్సిన బియ్యాన్ని యథేచ్ఛగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తంతు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ ఆలస్యంగా మేల్కొన్న అధికార యంత్రాంగం అక్రమ బియ్యం రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ అక్రమార్కులకు అధికారపార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో తమ అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రతినెలా వేల క్వింటాళ్ల కొద్దీ ప్రజాపంపిణీ బియ్యాన్ని మాఫియా రూటుమార్చి...రూపుమార్చి పక్కదారి పట్టిస్తూనే ఉంది.

వివరాల్లో కెళితే...డివిజన్‌ కేంద్రమైన నరసరావుపేట మండల పరిధిలో ఉన్న 115 చౌకదుకాణాల ద్వారా 49వేల మంది కార్డుదారులకు 757మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ప్రతినెలా పంపిణీ చేయాల్సి ఉంది. అందులో కార్డుదారులకు నామమాత్రంగా పంపిణీ చేసి మిగిలిన బియ్యాన్ని డీలర్లు నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యమే. ఈతంతు ఒక్క నరసరావుపేటలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. తెలుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు ఉన్న రేషన్‌ డీలర్లను అకారణంగా తొలగించి వారి స్థానాల్లో పార్టీ ద్వితియశ్రేణి నాయకులను నియమించారు. దీంతో రేషన్‌ అక్రమాలపై అనేక ఫిర్యాదులు వచ్చినా పౌరసరఫరాల, రెవెన్యూ శాఖల అధికారులు రేషన్‌షాపుల వైపు నామమాత్రపు తనిఖీలు కూడా చేయలేదన్న విమర్శలు  ఉన్నాయి. కొంతమంది డీలర్లు ప్రతినెలా కార్డుదారుల నుంచి వేలిముద్రలు వేయించుకొని బియ్యం ఇవ్వకుండా నగదు ఇస్తున్నారు. బియ్యం పంపిణీ చేయాలని కోరినప్పటికీ వచ్చేనెల తీసుకోండి అంటూ ప్రతినెలా అదేమాట చెప్పి రేషన్‌ బియ్యాన్ని భోంచేస్తున్నారు.

పర్యవేక్షణ లేమి...
ప్రతినెలా కార్డుదారులకు పంపిణీ చేసేందుకు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి చౌకదుకాణాలకు వేలాది క్వింటాళ్ల బియ్యం దిగుమతి అవుతుంది. గతంలో రూట్‌ అ«ధికారైన ఆర్‌ఐ పర్యవేక్షణలో బియ్యం దిగుమతి జరిగేది. ప్రజాపంపిణీ బియ్యం రవాణా వాహనానికి జీపీఆర్‌ఎస్‌ సిస్టం అమర్చడంతో రూట్‌ అధికారులను తొలగించారు. దీంతో రేషన్‌ షాపుల వద్ద బియ్యం దిగుమతి సమయంలోనే అక్రమార్కులు సంచులు మార్చి నల్లబజారుకు తరలిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. దీంతోపాటు ప్రజాపంపిణీ సక్రమంగా జరుగుతుందా లే దా అనే అంశాన్ని అధికారులు విస్మరించారు. దీంతో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించకపోవడంతో గంటల కొద్ది వేచిఉన్న కార్డుదారులు అసహనంతో వెనుదిరిగి పోవడం పరిపాటిగా మారింది. రేషన్‌సరుకుల కోసం కాళ్ళరిగేలా తిరగలేక డీలరిచ్చినంత పుచ్చుకుంటున్నారు కార్డు దారులు. ఇలా సేకరించిన బియ్యాన్ని సంచులు మార్చి బియ్యం మాఫియా రాష్ట్రాలను దాటిస్తుంది. ప్రతినెలా డీలర్ల నుంచి రెవెన్యూ, పోలీస్‌శాఖ మామూళ్ళు తీసుకుంటూ నిద్రావస్థలో నటిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

సామాజిక బృందం తనిఖీతో వెలుగు చూసిన అక్రమాలు...
సామాజిక తనిఖి బృందం గతేడాది అక్టోబర్‌ నెలలో నకరికల్లు, రొంపిచర్ల, ఈపూరు మండలాల్లోని చౌకదుకాణాల్లో తనిఖీలు చేపట్టింది. 107చౌకదుకాణాల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా ఇటీవల ఆర్డీవో గంధం రవీందర్‌ 87రేషన్‌ డీలర్లను తొలగించారు. బియ్యం అక్రమ రవాణాను నివారించేందుకు పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖాధికారులను కలిపి జేఏసీగా ఏర్పాటు చేశారు. దీంతోపాటుగా బియ్యం అక్రమాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు కంట్రోల్‌ రూంను ఏర్పాటుచేసి పర్యవేక్షణకు ఏఎస్‌వోను అధికారిగా నియమించారు. మొదటివిడత నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గంలో పలు మండలాలను పైలెట్‌ మండలాలుగా గుర్తించారు. జేఏసీ బృందం ప్రతిరోజు చౌకదుకాణాలను తనిఖీ చేసి అక్రమాలకు పాల్పడిన డీలర్లపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.

అక్రమ రవాణాను జేఏసీ అరికట్టేనా?
ఆర్డీఓ గంధం రవీందర్‌ బియ్యం అక్రమ రవాణాపై జాయింట్‌ యాక్షన్‌ కమిటీని ఏర్పాటుచేసిన రెండో రోజే రొంపిచర్ల మండలం విప్పర్లరెడ్డిపాలెంలోని ఓ చౌకదుకాణంలో 41క్వింటాళ్ల ప్రజాపంపిణీ బియ్యం దుర్వినియోగం అయింది. దీంతోపాటు గత 20రోజుల క్రితం ప్రకాష్‌నగర్, సత్తెనపల్లి రోడ్డు రెండు ప్రాంతాల్లో రేషన్‌బియ్యం అక్రమంగా తరలిస్తున్న ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారి అధికారపార్టీ కౌన్సిలర్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఏంజల్‌ టాకీస్‌ ప్రాంతంలోని ఓ చౌకదుకాణ డీలరు రేషన్‌ బియ్యాన్ని రాత్రిపూట అక్రమంగా తరలిస్తున్నాడు. సమాచారం అందుకుని పోలీసులు అక్కడికి చేరుకునే సరికి బియ్యంలోడు ఆటో వెళ్ళిపోయింది. అధికారులు హెచ్చరిస్తున్నా...నివారణకు చర్యలు చేపడుతున్నా...బియ్యం మాఫియా మాత్రం తన ఆగడాలను ఆపడం లేదు. ఉన్నతస్థాయి అధికారులు దృష్టిసారిస్తే గానీ బియ్యం మాఫియా నియంత్రణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top