కార్డు నిజం.. పేర్లు అబద్ధం | Ration Dealers Issue Fraud Ration Cards In TDP Government | Sakshi
Sakshi News home page

కార్డు నిజం.. పేర్లు అబద్ధం

Aug 5 2019 10:16 AM | Updated on Aug 5 2019 10:17 AM

Ration Dealers Issue Fraud Ration Cards In TDP Government - Sakshi

టీడీపీ హయాంలో ఆ పార్టీ మద్దతు దారులైన కొందరు డీలర్లు దోపిడీకి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ సద్వినియోగం చేసుకున్నారు. రేషన్‌ సరుకులు నొక్కేందుకు కొత్త దారి కనుక్కున్నారు. లబ్ధిదారులకే తెలియకుండా వారి కార్డుల్లో ఇతరుల పేర్లు చేర్పించారు. అలా అదనంగా నమోదైన వారి పేరుతో రేషన్‌ సరుకులు ఏళ్లుగా స్వాహా చేశారు. తాజాగా కార్డుదారుల ఆధార్‌ వివరాలను ప్రజాసాధికార సర్వేకు అనుసంధానం చేయడంతో వారి బొక్కుడు వ్యవహారం బయటపడింది. 

సాక్షి, అనంతపురం: డీలర్ల మాయలు అన్నీ ఇన్నీకావు. దోచుకునేందుకు తలోదారి వెతుక్కున్నారు. టీడీపీ హయాంలో అధికార పార్టీ అండదండలున్న వారైతే మరీ ఇష్టానుసారం వ్యవహరించారు. కార్డుదారులకే తెలియకుండా ఆన్‌లైన్‌లో మాయ చేశారు. కొందరి కార్డుల్లో కుటుంబసభ్యులుగా ప్రభుత్వ ఉద్యోగులను చేర్పించారు. అలా చేర్పించిన వారి పేరున వచ్చే బియ్యం కోటాను నొక్కుతూ వచ్చారు.
 
టీడీపీ మద్దతుదారులైన డీలర్ల చేతి వాటం 
జిల్లాలో 3,003 చౌక దుకాణాలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పలు మండలాల పరిధిలోని చాలా గ్రామాల్లో  చౌకదుకాణాల డీలర్లుగా టీడీపీ కార్యకర్తలు ఆపార్టీ సానుభూతిపరులు వ్యవహరించారు. వీరిలో కొందరు డీలర్లు చేతి వాటం ప్రదర్శించి అవినీతికి తెరలేపారు. కార్డుదారులకు తెలియకుండా ఆన్‌లైన్‌లో వారి కుటుంబ సభ్యులుగా ఇతరులను చేరుస్తూ ఆధార్‌ను ఈ–పాస్‌కు అనుసంధానం చేశారు. కార్డుల్లో అలా చేర్చిన పేర్ల మీద వచ్చే బియ్యాన్ని నొక్కేశారు. ఈ తతంగం ఏళ్లుగా సాగింది.  

అనుసంధానంతో వెలుగుచూస్తున్న అక్రమాలు 
తాజాగా ఈకేవైసీ కింద రేషన్‌ కార్డుల్లోని సభ్యుల ఆధార్‌ను ప్రజాసాధికార సర్వేకు అనుసంధానం చేస్తుండడంతో గతంలో డీలర్లు చేసిన అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. కార్డుల్లో డీలర్లు చేర్చిన పేర్లలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఆధార్‌ అనుసంధానంతో కార్డులో సభ్యునిగా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లు చూపిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు సభ్యులుగా ఉన్న కార్డులకు ఆటోమేటిక్‌గా నిత్యావసర సరుకుల పంపిణీ నిలిచిపోయింది. దీంతో కార్డుదారులు ఆందోళనకు గురై తహసీల్దారు కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. అక్కడ ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే తమ కుటుంబాలకు సంబంధం లేని వ్యక్తులు కార్డుల్లో సభ్యులుగా ఉన్నారు. జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
 
నిలిచిన రేషన్‌ పంపిణీ 
కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే వారు తెల్లరేషన్‌ కార్డు పొందేందుకు అనర్హులు. కానీ కొందరు డీలర్లు తమ స్వార్థం కోసం కార్డుదారులకే తెలియకుండా వారి కుటుంబీకులుగా పలువురు ఉద్యోగుల పేర్లను చేర్చారు. ఇపుడు  ప్రజాసాధికార సర్వేకు రేషన్‌ కార్డుల్లో సభ్యుల ఆధార్‌ అనుసంధానంతో పాటు, ఈకేవైసీ చేస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు రేషన్‌ కార్డుల్లో సభ్యులుగా వారికి రేషన్‌ నిలిచిపోయింది. ఇలా జిల్లావ్యాప్తంగా ఈనెలలో 12 వేల కార్డులకు రేషన్‌ పంపిణీ ఆగింది. వీటిలో చాలా కార్డుల్లో కార్డుదారుల కుటుంబంలో సభ్యులు కాని వారి పేర్లు నమోదయ్యాయి.  

తహసీల్దార్‌ ద్వారా రిపోర్ట్‌ పంపించాలి 
రేషన్‌ కార్డుల్లో వారి కుటుంబ సభ్యులు కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల పేరు నమోదై ఉండి రేషన్‌ నిలిచిపోయి ఉంటే... అలాంటి కార్డుదారులు నేరుగా తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తూ అర్జీ ఇవ్వాలి. కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డుల జిరాక్స్‌లను అర్జీతో జతచేయాలి. దీనిపై తహసీల్దారు విచారణ చేసి... ఫిర్యాదు వాస్తవమేనని నిర్ధారణ అయితే... నివేదికను జిల్లా సరఫరాల శాఖకు పంపించాలి. దాన్ని ప్రభుత్వానికి పంపించి కార్డులో సంబంధం లేని సభ్యుల పేర్లను తొలగిస్తారు. అప్పుడు రేషన్‌ పంపిణీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.    – డి.శివశంకర్‌రెడ్డి, జిల్లా సరఫరాల అధికారి  

తన తెల్లరేషన్‌ కార్డు(డబ్ల్యూఏపీ 121102500289) తీసుకుని డీలర్‌ వద్దకు వెళ్లి ఈపాస్‌ యంత్రంలో వేలిముద్ర వేయగానే బియ్యం రాదన్నట్లుగా చూపించింది. దీంతో తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి అధికారులకు విషయం చెప్పగా.. వారు ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. ఇతని కార్డులో సంతోష్‌కుమార్‌ అనే ప్రభుత్వ ఉద్యోగి పేరు నమోదై ఉంది. అందువల్లే బియ్యం రాలేదని చెప్పారు. వాస్తవంగా తమ కుటుంబంలో సంతోషకుమార్‌ అనే వ్యక్తే లేడని, ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు అసలే లేరని ఆంజనేయులు వాపోతున్నాడు. - ఎం.ఆంజనేయులు. శింగనమల మండలం సి.బండమీదపల్లి గ్రామం.

వీరికి తెల్లరేషన్‌ కార్డు (డబ్ల్యూఏపీ 1211002500204) ఉన్నా... డీలరు బియ్యం  వేయకపోవడంతో తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాడు. ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే... ఇతని  రేషన్‌కార్డులోనూ సంతోష్‌కుమార్‌ అనే పేరు నమోదై ఉంది. అతను ప్రభుత్వ ఉద్యోగి కావడంతో రేషన్‌ నిలిచిపోయినట్లు చూపుతోందని అధికారులు తెలిపారు. తమ కుటుంబంలో ఉద్యోగం చేస్తున్న సంతోష్‌కుమార్‌ పేరున్న వ్యక్తి ఎవరూ లేరని, ఎవరు ఎక్కించారో అర్థం కావడం లేదని బాధితుడు వాపోయాడు. - చిక్కాల నారాయణస్వామి, శింగనమల మండలం సి.బండమీదపల్లి గ్రామం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement