మండల పరిధిలో ఆరు గ్రామాల్లో అతిసార వ్యాధి విజృంభిస్తోంది.
మోమిన్‌పేట, న్యూస్‌లైన్: మండల పరిధిలో ఆరు గ్రామాల్లో అతిసార వ్యాధి విజృంభిస్తోంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 27మంది అతిసార వ్యాధితో చికిత్స పొందినట్లు వైద్యాధికారి సాయిబాబ తెలిపారు. మోమిన్‌పేటలో 10 మంది, రాంనాథ్‌గుడుపల్లిలో 14 మంది, గోవిందాపూర్‌లో 8మంది, వెల్‌చాల్‌లో నలుగురు, చంద్రాయన్‌పల్లి ఇద్దరు, మొరంగపల్లిలో ఇద్దరు, ఇజ్రాచిట్టంపల్లిలో ఇద్దరు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. రాంనాథ్‌గుడుపల్లి, గోవిందాపూర్ గ్రామాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కలుషిత తాగు నీటితోనే అతిసార వ్యాధి ప్రబలుతున్నట్లు ఆయన చెప్పారు. కాచి వడబోసిన నీటినే తాగాలని ప్రజలకు సూచించారు. పైప్‌లైన్‌ల లీకేజీలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీశాఖను కోరారు.
వ్యాధిగ్రస్తులు పెరిగితే....
రాంనాథ్‌గుడుపల్లి, గోవిందాపూర్‌లలో కలుషిత నీరు లేకుండా చూడాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులను తహసీల్దార్ రవీందర్ ఆదేశించారు. పైప్‌లైన్ లీకేజీలకు మరమ్మతులు చేసిన తర్వాత కూడా వ్యాధి ప్రబలితే గ్రామాల్లో కల్లు విక్రయాలను నిలిపివేస్తామని చెప్పారు. ఈ విషయమై ఎక్సైజ్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్లు తహసీల్దార్ చెప్పారు. ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన భరోసానిచ్చారు.