నిధులిచ్చినా నీరసమే | Rajiv Vidya Mission Scheme Criticisms | Sakshi
Sakshi News home page

నిధులిచ్చినా నీరసమే

Nov 19 2014 1:18 AM | Updated on Aug 20 2018 9:16 PM

ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ విద్యామిషన్ పథకం పదేళ్లుగా అమలవుతున్నా.. అవసరమైన నిధులు

ఏలూరు సిటీ :ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ విద్యామిషన్ పథకం పదేళ్లుగా అమలవుతున్నా.. అవసరమైన నిధులు అందజేస్తున్నా.. ఆశించిన ఫలితాలు ఇవవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్లలో గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.93 కోట్లు నిధులు మంజూరైనా ఇప్పటికీ 300కు పైగా అదనపు గదుల నిర్మాణాన్ని అసలు ప్రారంభించనే లేదు. అలాగే కిచెన్ షెడ్ల నిర్మాణం కోసం రూ.15.64 కోట్లను మంజూరు చేసినా ఎస్‌ఎస్‌ఏ చేపట్టిన వాటిలో 50 శాతం పూర్తి కాగా, హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో 470 కిచెన్ షెడ్లను నిర్మించాల్సి ఉండగా, ఒక్కటీ నిర్మాణానికి నోచుకోలేదు. అంతేకాక భారీగా నిధులు దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ శాఖ తీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవుతుందనే విమర్శలు సైతం ఉన్నాయి. మరోవైపు భారం తగ్గించుకునే సాకుతో ప్రస్తుత ప్రభుత్వం కొన్ని చోట్ల పిల్లలు లేరనే కారణంగా పాఠశాలలను మూసివేస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ముందుచూపు కరువు
ప్రాథమిక విద్యను బలోపేతం చేయటం, ఈ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన బోధన కోసం ఉపాధ్యాయులకు శిక్షణ , విద్యార్థులున్నా పాఠశాలలు లేని ప్రాంతాల్లో స్కూళ్ల ఏర్పాటు తదితర బృహత్తర కార్యక్రమాలను రాజీవ్ విద్యామిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. జిల్లాలో గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో నాలుగేళ్లలో (2011-12 నుంచి 2014- 15) సుమారు 1,447 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.93 కోట్ల నిధులు మంజూరయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో 1,166, అర్బన్ ప్రాంతంలో 281 తరగతి గదులు నిర్మించాల్సి ఉంది. అయితే వీటిలో ఇప్పటివరకు 300పైగా అదనపు తరగతి గదుల నిర్మాణ మే ప్రారంభమే కాలేదు. ఇదిలా ఉండగా కొన్ని చోట్ల విచిత్ర పరిస్థితి నెలకొంది. అధికారులు ముందుచూపుతో వ్యవహరించకపోవడంతో వందల కోట్ల నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు నిరుపయోగంగా మారుతున్నాయి. పాఠశాలలో విద్యార్థులే లేనప్పుడు తరగతి గదుల నిర్మాణం ఎందుకు చేపట్టారన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ నేతల ఒత్తిడి, ప్రలోభాలతోనే అవసరంలేని చోట్ల కూడా అదనపు తరగతి గదులు నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. అవసరం ఉన్న చోట్ల పట్టించుకోని అధికారులు విద్యార్థులు లేని ప్రాంతాల్లో భవనాల నిర్మాణానికి అత్యుత్సాహం చూపారని విమర్శిస్తున్నారు.

కిచెన్‌షెడ్ల నిర్మాణంలో అలసత్వం
వీటితోపాటు బాలికలకు మరుగుదొడ్లు, ప్రహరీగోడల నిర్మాణం, ఫర్నిచర్, ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక గదుల నిర్మాణం, కిచెన్‌షెడ్లు వంటివాటికి రూ.150 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి 2014-15లో 1,043 కిచెన్‌షెడ్లు నిర్మించాలని నిర్ణయించారు. వీటి నిర్మాణం కోసం రూ.15.64 కోట్లు నిధులు ఖర్చు చేసేందుకు అనుమతులు వచ్చాయి. అయితే అక్టోబర్ మాసాంతానికి కిచెన్‌షెడ్లు పూర్తిచేసింది 218 మాత్రమే. నిర్మాణ దశలో మరో 44 ఉన్నాయి. 781 కిచెన్‌షెడ్ల నిర్మాణ పనులు నేటికీ ప్రారంభం కాలేదు. ఈ కిచెన్‌షెడ్లలో సర్వశిక్ష అభియాన్ నిర్మించాల్సినవి 488 కాగా వీటికి రూ.7.32 కోట్లు, గృహనిర్మాణ సంస్థ 470 కిచెన్‌షెడ్లకు రూ.7.05 కోట్లు నిధులు మంజూరు చేశారు. మునిసిపాలిటీల్లో కిచెన్‌షెడ్ల నిర్మాణాన్ని విస్మరించారు. వర్షాలు పడితే పిల్లలకు భోజనం వండేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, త్వరితగతిన కిచెన్‌షెడ్లు నిర్మించాలని అధికారులు ఆదేశించినా చర్యలు కరువయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement