
22 నుంచి అనంతలో.. ‘రైతు భరోసా యాత్ర’
రైతు కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 22 నుంచి ‘రైతు భరోసా యాత్ర’ నిర్వహించనున్నారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు.
- ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం అర్బన్: అప్పుల బాధను తట్టుకోలేక అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 22 నుంచి ‘రైతు భరోసా యాత్ర’ నిర్వహించనున్నారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఆ పార్టీ పోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు.
జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన నేపథ్యంలో అసెంబ్లీలో ఇటీవల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు ఆధారాలతో సమస్యను లేవనెత్తారని తెలిపారు. బాధిత రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోకపోతే, వారికి భరోసా కల్పించేందుకు తానే స్వయంగా వె ళ్లి పరామర్శిస్తానని జగన్ ప్రకటించినట్టు పేర్కొన్నారు.
ఆ పరిణామంతో దిగొచ్చిన చంద్రబాబు.. రైతు ఆత్మహత్యలను ఒప్పుకున్నారన్నారు. తమ పార్టీ ఒత్తిడితోనే జిల్లాలో 29 మంది రైతు, 11 మంది చేనేత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించిందన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇప్పటి వరకు 86 మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని, వారి జాబితాను అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు అందజేశామని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చెప్పారు.