రానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పరిశీలన కోసం రాహుల్‌గాంధీ దూత అమిత్ దేశ్‌ముఖ్ ఈ నెల 3న కరీంనగర్‌కు వస్తున్నారు.
సాక్షి, కరీంనగర్ : రానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పరిశీలన కోసం రాహుల్‌గాంధీ దూత అమిత్ దేశ్‌ముఖ్ ఈ నెల 3న కరీంనగర్‌కు వస్తున్నారు. అమిత్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్‌రావు దేశ్‌ముఖ్ కుమారుడు. మహారాష్ట్రలోని లాతూరు అర్బన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన రెండు రోజుల పాటు ఇక్కడే మకాం వేసి కరీంనగర్ లోక్‌సభ స్థానంతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన పార్టీ నాయకులను కలుస్తారు.
ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకోవడంతో పాటు వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని తెలుసుకుంటారు. లోకసభ స్థానంతో పాటు వాటి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో విజయావకాశాలున్న ముగ్గురిని గుర్తించి వారి పేర్లను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అందజేస్తారు. వీరు తయారు చేసిన జాబితాల నుంచే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలకు తన అభ్యర్థులను ఎంపిక చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో రాహుల్ దూతను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్ లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఈ స్థానానికి తర నేతలెవరూ పోటీ పడకపోవచ్చునని భావిస్తున్నారు.
కరీంనగర్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు చాలా మంది ఆశిస్తున్నారు. అమిత్ రూపొందించే జాబితాలో చోటు దక్కించుకుంటే టికెట్ దక్కడం దాదాపు ఖాయమన్న భావనతో బలసమీకరణకు సిద్ధమవుతున్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్‌లో అమిత్ రెండు రోజుల పాటు ఆయా నియోజకవర్గాలలో పార్టీ నిర్మాణం, రాజకీయ పరిస్థితులు, నేతల తీరు తదితర అంశాలపై సమాచారాన్ని సేకరిస్తారు.
రెండు రోజుల్లో రాహుల్ దూత వస్తున్నారనే సమాచారంతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సందడి మొదలైంది. జనవరి 23న పెద్దపల్లి లోక్‌సభ స్థానంతోపాటు దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఎమ్మెల్యే విజయ్ వాడేటివార్ రాహుల్ దూతగా కరీంనగర్ వచ్చారు. పార్టీ నేతలతోపాటు వివిధ వర్గాల నుంచి ఆయన అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్భంగా విజయ్ ముందు పలువురు నాయకులు బలప్రదర్శనకు దిగారు. ఒక్కో సెగ్మెంటు నుంచి నలుగురైదుగురు నేతలు పోటీ పడ్డారు. అందరూ పెద్ద ఎత్తున కార్యకర్తలను మోహరించి రాహుల్ దూతను ఆకట్టుకునేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.