ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం ఉధృతం

Rachamallu Shivaprasadreddy fires on TDP - Sakshi

వైఎస్సార్‌ జిల్లా (ప్రొద్దుటూరు) : కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైఎస్సార్సీపీ పోరాటం ఉధృతం చేసింది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్‌లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మంగళవారం దీక్ష ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమ పేరుతో ఆడుతున్న డ్రామాలపై ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీ రెండు కలిసి ద్రోహం చేశాయని, కడప ఉక్కు రాయలసీమ హాక్కు అని నినదించారు. ప్రత్యేక హోదా హామీలు నెరవేర్చకపోతే పోరాడతాం అనకుండా టీడీపీ నాయకులు లాలూచీ పడ్డారని మండిపడ్డారు. ఎన్నికల కోసం ఏ అస్త్రం లేక ఇప్పుడు టీడీపీ నాయకులు ప్రత్యేక హోదా, ఉక్కు అంటూ కపట నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు.

రామేశ్వరం రోడ్డులో ఉన్న బుశెట్టి కల్యాణ మండపం నుంచి మంగళవారం ఉదయం రాచమల్లు దాదాపు 10వేల మందితో ర్యాలీగా రామేశ్వరం రోడ్డు, గాంధీ రోడ్డు, టీబీ రోడ్డు, రాజీవ్‌ సర్కిల్‌ మీదుగా పుట్టపర్తి సర్కిల్‌కు చేరుకున్నారు. ర్యాలీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు  శ్రీకాంత్‌ రెడ్డి, రఘురాంరెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత అమర్‌నాథ్‌ రెడ్డిలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న దీక్షకు మద్దతుగా పట్టణంలోని వ్యాపారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. అపహాస్యం, అవహేళన చేసిన సందర్భాల్లో కూడా వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి ప్రత్యే హోదా కోసం అలుపెరగని పోరాటాలు చేశారని గుర్తు చేశారు.
 48గంటల దీక్షతో ఆగేది లేదని, గల్లీ స్థాయికి పోరాటాన్ని తీసుకెళతామని స్పష్టం చేశారు.

విభజన హామీల్లో ఇచ్చిన ప్రకారం కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. నాలుగు సంవత్సరాలు బీజేపీతో కలిసుండి, టీడీపీ నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలు పొందారన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేత సీఎం రమేష్‌ ఆమరణ దీక్ష చేస్తానంటున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాలు పొంది ఎన్నికల ముందు మీరు చేసే పోరాటాలను ఉక్కు పోరాటం అనరని, తుక్కు పోరాటం అంటారని మండిపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top