రాజధానిపై ప్యాక్షన్ పంజా

రాజధానిపై ప్యాక్షన్ పంజా - Sakshi


తాడేపల్లి రూరల్ :నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంపై ఫ్యాక్షన్ ముఠాలు కన్నేశాయా..? అనంతరపురం గూండాలు తాడేపల్లిలో అడుగుపెట్టారా..? భూ కబ్జాలకు తెర తీసి, ఉనికి చాటుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారా...? ఈ అనుమానాలు రాజధాని ప్రాంతమైన తాడేపల్లి ప్రజలను కలవరపెడుతున్నాయి. తాడేపల్లి బైపాస్‌లోని కొన్ని దుకాణాలు ఫ్యాక్షనిస్టులకు అడ్డాగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికార పార్టీ జెండాలతో కొందరు హల్‌చల్ చేయడం వీటన్నిటికీ బలం చేకూర్చుతోంది.

 

తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు కీలక నేతగా వెలుగొందిన అనంతపురం నేత ముఖ్య అనుచరులు కొందరు తాడేపల్లి ప్రాంతంలో పాగా వేసి ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు సీతానగరం, మహానాడు తదితర ప్రాంతాల్లో అసైన్‌‌డ భూములను ఇక్కడి చోటామోటా నాయకులు మార్చి, మార్చి అమ్ముతూ.. సొమ్ము చేసుకుంటూ ఉండేవారు. ఈ దందా ఆ ప్రాంతానికే పరిమితమైంది. అనంతపురం మాఫియా మాత్రం భూ దందాలు మొదలెట్టిందని, తాడేపల్లి డాక్టర్స్ ప్లాజా సమీపంలో ఓ స్థలాన్ని ఆక్రమించి, గోడలు నిర్మించిందని స్థానికులు చెబుతున్నారు.ఇదేమని ప్రశ్నించేందుకు వచ్చిన వారిపై దౌర్జన్యానికి దిగినట్లు తెలిసింది. ఇటీవల జైలు నుంచి విడుదలైన అనంతపురం నేత ప్రధాన అనుచరుడొకరు మరో 20 మందితో కలిసి, తాడేపల్లిలో మకాం వేసినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఇక్కడ సీసాల కంపెనీ యాజమానిని ఈ ముఠా సభ్యులు బెదిరించి, డబ్బు డిమాండ్ చేశారని, దీనిపై బాధితుడు స్థానిక నాయకులను ఆశ్రయించి, రక్షణ కోరారని తెలిసింది.

 

వీఐపీలు తిరిగే ప్రాంతంలో నిఘా కరువు..

ఆరంభంలోనే ఉనికి చాటుకుంటే కాబోయే రాజధానిలో తమకు అడ్డే ఉండదని, భూ దందాలతో ఆరంభించి, కిరాయి హ త్యల దాకా కొనసాగించాలనే ఆలోచనతో అనంతపురం ముఠా ఉన్నట్టు వినికిడి. ఈ ముఠాకు ఓ అరటి గెలల దుకాణం నిర్వాహకుడు ఆశ్రయం ఇచ్చినట్లు కొందరు చెబుతున్నారు. వీరికి అధికార పార్టీ అండదండలున్నాయని, బెజవాడ గూండాల సహకారం కూడా తీసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎక్కడి నుంచో వచ్చిన ఓ ముఠా చాప కింద నీరులా ఫ్యాక్షనిజాన్ని విస్తరింపచేస్తుంటే రక్షక భటులకు తెలియలేదా.. అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వీఐపీలు తిరిగే రాజధాని ప్రాంతంలో అపరిచితుల రాకపోకలతో ఊహించని దుర్ఘటన జరిగితే, పరిస్థితి ఏమిటని, ప్రశాంత వాతావరణంలో కల్లోలం రేగక ముందే గట్టి భద్రత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top