పోలీసు వ్యవస్థపై టీడీపీ పెత్తనమేంటి.?

పోలీసు వ్యవస్థపై టీడీపీ పెత్తనమేంటి.?

► వరుస హత్యలు, దొంగతనాలతో భయబ్రాంతులవుతున్న జనం

► పంచాయితీలు, సెటిల్‌మెంట్లకు అడ్డాగా తాలూకా పోలీసు స్టేషన్‌

► టీడీపీ రాజకీయాల వల్లే డీఎస్పీ నియామకంలో ఆలస్యం

► శాంతియుత వాతావరణం నెలకొల్పడమే వైఎస్సార్‌సీపీ ఎజెండా

► ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

 

కడప కార్పొరేషన్‌: ప్రొద్దుటూరులో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.  మంగళవారం జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీకి  వినతిపత్రం సమర్పించిన అనంతరం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రొద్దుటూరులో ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస హత్యలు, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలతో ప్రజలు, వ్యాపార వర్గాల వారు భయాందోళనకు గురవుతున్నారన్నారు.



మడూరు రోడ్‌లో ఆయిల్‌ మిల్‌ దగ్గర చంద్రశేఖర్‌రెడ్డి హత్య మొదలుకొని నిన్న హైందవి హత్య వరకూ 9 హత్యలు, 5 దొంగతనాలు జరిగాయన్నారు. ఈ మ«ధ్య జరిగిన ఓ హత్యను వాట్సాప్‌లో ప్రపంచ వ్యాప్తంగా వీక్షించారని గుర్తు చేశారు. తమకు శాంతి ఒక కన్ను అయితే అభివృద్ధి మరో కన్ను అని, శాంతి లేని చోట అభివృద్ధి జరగదని తెలిపారు. సభలు, సమావేశాల ద్వారా ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఈమేరకు స్థానిక ఎమ్మెల్యేగా తాను శాంతి సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్క పోలీసు అధికారి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

పోలీసు వ్యవస్థపై టీడీపీ పెత్తనమేంటి.?

డీఎస్పీని నియమించకపోవడం వల్లే శాంతిభద్రతలు అదుపులో లేవని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాట్లాడటం వాస్తవమేనన్నారు. అయితే డీఎస్పీని నియమించకపోవడానికి  కారణం ఆయనేనని విమర్శించారు. సీఎం రమేష్, వరదరాజులరెడ్డి, లింగారెడ్డిలు ఎవరికి వారు తమకు అనుకూలమైన అధికారిని నియమించుకోవాలనే ధోరణితో డీఎస్పీ నియామకాన్ని జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించేవారు అయి తే చాలునన్న ఏకాభిప్రాయం టీడీపీ నేతల్లో కొరవడిందన్నారు. అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐగా శ్రీనివాసులును నియమిస్తే అరగంటకే ఆయన్ను పంపించేశారని, మళ్లీ ఆ పోస్టు భర్తీ కావడానికి కొన్ని నెలలు పట్టిందన్నారు. ఇటీవల సుధాకర్‌రెడ్డిని నియమిస్తే ఆయన నెలరోజులకే దీర్ఘకాలిక సెలవులో వెళ్లారన్నారు. పోలీసు వ్యవస్థపై టీడీపీ పెత్తనమేంటని ఎమ్మెల్యే సూటిగా ప్రశ్నించారు.



ప్రొద్దుటూరులో తాలూకా పోలీస్‌స్టేషన్‌ పంచాయితీలు, సెటిల్‌మెంట్లు, కమీషన్లకు అడ్డాగా మారిందని ఆరోపించారు. సీఐ, ఎస్‌ ఐలు పూర్తి పక్షపాతంతో టీడీపీ వారికి వంతపాడుతున్నారని ధ్వజమెత్తారు.  డీఎస్పీగా నిజాయితీ పరుడైన డైనమిక్‌ ఆఫీసర్‌ను నియమించేందుకు టీడీపీ నేతలు సహకరించాలని అప్పుడే ప్రొద్దుటూరులో పరిస్థితులు చక్కబడుతాయన్నారు. వాస్తవ పరిస్థితులను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకుపోయామని, ఆయన అన్నీ శ్రద్ధగా విని సానుకూలంగా స్పందించారన్నారు.   మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మురళీధర్‌రెడ్డి, 34వ వార్డు కౌన్సిలర్‌ భర్త పోసా భాస్కర్, పార్టీ కార్యదర్శి చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు.  
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top