
నాగమణి మరణంతో అనాథగా మారిన బిడ్డ, (సర్కిల్‌లో) మృతి చెందిన బాలింతరాలు
రాజవొమ్మంగి (రంపచోడవరం): రాజవొమ్మంగి మండలం చినరెల్లంగిపాడు గ్రామానికి చెందిన గూడెపు నాగమణి(23) బాలింత తన మూడు నెలల ఆడబిడ్డను అనాథను చేస్తూ గురువారం రాత్రి కాకినాడ జీజీహెచ్‌లో కన్నుమూసింది. కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని శుక్రవారం సాయంకాలం స్వగ్రామానికి తరలించారు. ఈనెల 13వ తేదీ మొదలు ఇప్పటి వరకు ఇరువురు శిశువులు మృతి చెందగా, ఒక బాలింత మరణించిన సంగతి తెలిసిందే. నాగమణి మరణంతో ఈ సంఖ్య నాలుగుకి చేరింది. రెండో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన నాగమణి అప్పటి నుంచి తీవ్ర రక్తహీనతతో బాధపడుతోంది. అయితే తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె కుటుంబ సభ్యుల సహాయంతో బుధవారం రాజవొమ్మంగి పీహెచ్‌సీకి చికిత్స కోసం వచ్చింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్య సిబ్బంది ఆమెను అదే రోజు కాకినాడ జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. కాగా నాగమణి పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ చివరికి మరణించింది. నాగమణికి మొదటి కాన్పులోనూ ఆడబిడ్డే జన్మించింది. ఇద్దరు ఆడపిల్లలు నాగమణి మృతితో దిక్కులేనివారయ్యారని భర్త కన్నీరుమున్నీరయ్యాడు.